వైసీపీ ముక్త ఏపీ..పవన్‌తో సాధ్యమేనా?

వైసీపీని ఎలాగైనా నెక్స్ట్ అధికారానికి దూరం చేసి తాము గద్దెనెక్కాలని టీడీపీ అధినేత చంద్రబాబు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఈ సారి ఏ మాత్రం జగన్‌కు ఛాన్స్ ఇవ్వకూడదని, తాను సీఎం పీఠం దక్కించుకోవాలని చెప్పి కష్టపడుతున్నారు. అలా కష్టపడటం వల్ల కాస్త టీడీపీ పికప్ అయింది కానీ..వైసీపీకి చెక్ పెట్టే స్థాయిలో పార్టీ బలపడలేదు. అది మాత్రం క్లియర్‌గా అర్ధమవుతుంది.

అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం..వైసీపీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. తాజాగా విశాఖలో జరిగిన సంఘటనలు, జనసేన శ్రేణులని అరెస్ట్ చేయడం, జనవాణి కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వకపోవడం, పవన్‌ విషయంలో ఆంక్షలు విధించడం లాంటివి జరిగాయి. ఈ నేపథ్యంలో పవన్ సైతం…జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాను బీజేపీతో పొత్తులో ఉన్నా సరే..చీటికి మాటికి ఢిల్లీకి వెళ్ళి బీజేపీ పెద్దలకు ఫిర్యాదు చేయనని, ఇక్కడే అన్నీ తేల్చుకుంటానని వైసీపీకి వార్నింగ్ ఇచ్చారు. అలాగే వైసీపీ ముక్త ఏపీ అని పిలుపునిచ్చారు. వైసీపీని ఓడించడమే తన ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు.

అయితే పవన్‌కు వైసీపీకి చెక్ పెట్టే బలం ఉందా? అంటే అసలు లేదని డౌట్ లేకుండా చెప్పొచ్చు. రాష్ట్ర స్థాయిలో జనసేన బలం పెద్దగా లేదు..గట్టిగా చూసుకుంటే ఆ పార్టీ 10 లోపు సీట్లు గెలవగలదు. అంతకంటే ఆ పార్టీకి బలం కనిపించడం లేదు. కానీ 50-60 సీట్లలో గెలుపోటములని తారుమారు చేసే శక్తి జనసేనకు ఉంది.

అందుకే పవన్ సైతం పదే పదే వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చనివ్వను అని మాట్లాడుతున్నారు..అంటే టీడీపీతో పొత్తు గురించి ఇప్పటికే క్లారిటీ గానే ఉన్నారు. టీడీపీతో కలిస్తేనే..వైసీపీకి చెక్ పెట్టే ఛాన్స్ దొరుకుతుంది. అప్పుడైనా రెండు పార్టీలు గట్టిగా కష్టపడితే వైసీపీని నిలువరించగలవు. మరి వైసీపీకి చెక్ పెట్టడానికి పవన్..టీడీపీకి మరింత దగ్గరవుతున్నారని అర్ధమవుతుంది.