ఆలూరులో వైసీపీకి మైనస్..టీడీపీకి నో ప్లస్..!

రాష్ట్రంలో బీసీ వర్గం హవా ఎక్కువ ఉన్న స్థానాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఆలూరు కూడా ఒకటి. ఇక్కడ గెలుపోటములని బీసీ వర్గానికి చెందిన వాల్మీకి-బోయ, కురుబ కమ్యూనిటీలే డిసైడ్ చేస్తాయి. అలాగే ఎస్సీలది కూడా కీలేక పాత్ర ఉంది. అయితే ఆలూరులో ఇప్పటివరకు ఈ వర్గాలు వైసీపీ వైపే మొగ్గుచూపుతూ వస్తున్నాయి. గాట్ రెండు ఎన్నికల్లో వైసీపీ నుంచి గుమ్మనూరు జయరాం గెలుస్తూ వస్తున్నారు.

2014లో కేవలం 2 వేల ఓట్లతో గెలిచిన జయరాం..2019లో జగన్ వేవ్‌లో 40 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. వైసీపీ అధికారంలోకి రావడంతో మంత్రి అయ్యారు. మధ్యలో మంత్రి పదవి కూడా పోకుండా కంటిన్యూ అవుతున్నారు. అయితే ఇలా మంత్రిగా ఉన్న జయరాంకు ఆలూరులో ఇంకా తిరుగులేని బలం ఉందా? అంటే ఏ మాత్రం డౌట్ లేకుండా లేదనే చెప్పొచ్చు. ఆయనపై ఏ రకమైన ఆరోపణలు వచ్చాయో చెప్పాల్సిన పనిలేదు. బెంజ్ కారు లంచం, పేకాట క్లబ్బులు, ఇసుక దోపిడి, భూ అక్రమాలు అంటూ మంత్రిపై ఆరోపణలు వచ్చాయి.

అయినా సరే రెండోవిడత మంత్రివర్గ విస్తరణలో ఆయన పదవి పోలేదు.. మంత్రిగా కొనసాగుతున్నారు. ఇక మంత్రికి యాంటీగా ఆలూరులో కొందరు వైసీపీ నేతలు పనిచేస్తున్నారు. నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉంటే..అందులో నాలుగు మండలాల్లో మంత్రికి వ్యతిరేక వర్గాలు ఉన్నాయి. ఇక పథకాలు తప్ప..ఆలూరులో అభివృద్ధి లేదు. ఈ పరిణామాలు బట్టి చూస్తే ఆలూరులో మంత్రికి నెగిటివ్ ఉందని అర్ధమవుతుంది.

అలా అని ఆలూరులో టీడీపీకి పాజిటివ్ ఉందా? అంటే అది లేదు. ఇక్కడ ఇంచార్జ్‌గా కోట్ల సుజాతమ్మ ఉన్నారు..ఈమె అందరినీ కలుపుని పనిచేయడం, పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉండటం లాంటివి తక్కువ. ఏదో మొక్కుబడిగానే కార్యక్రమాలు చేస్తున్నారు. పైగా ఇక్కడ టీడీపీలో గ్రూపులు ఉన్నాయి. కోట్ల ఫ్యామిలీకి వ్యతిరేకంగా వీరభద్ర గౌడ్ గ్రూపు రాజకీయం చేస్తుంది. ఈ రెండు గ్రూపులు కలిసి పనిచేసే ఛాన్స్ కనిపించడం లేదు. దీంతో ఆలూరులో వైసీపీకి మైనస్ ఉన్నా సరే..టీడీపీకి ప్లస్ లేదు.