టీడీపీ కంచుకోట వైసీపీ ఖాతాలోకి?

రాష్ట్రంలో రాజకీయ బలాబలాలు మారుతున్నాయి..ఇప్పటివరకు వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ పుంజుకుంటుంది..అటు టీడీపీ బలంగా ఉన్న స్థానాల్లో వైసీపీ పుంజుకుంటుంది..ఇలా రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారుతూ వెళుతున్నాయి.  అయితే ఇటీవల వస్తున్న సర్వేల్లో కొన్ని సర్వేలు వైసీపీ అధికారంలోకి వస్తాయని, కొన్ని సర్వేలు టీడీపీ అధికారంలోకి వస్తాయని చెబుతున్నాయి.

అయితే ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది కాబట్టి…ఇప్పుడు వచ్చే సర్వేలు నిజం అనుకోవడానికి లేదు. కానీ ఈ సర్వేలని బట్టి రాజకీయం చేయొచ్చు. అలాగే నియోజకవర్గాల్లో నేతలు పనిచేసుకోవచ్చు. ఈ క్రమంలోనే తాజాగా వచ్చిన ఆత్మసాక్షి సర్వేలో టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తేలిన విషయం తెలిసిందే. అలా అని ఈ సర్వే నిజమవుతుందని లేదు. కానీ దీని ద్వారా వైసీపీ ఇంకా దూకుడుగా పనిచేయొచ్చు…అలాగే టీడీపీ కూడా ఇంకా జాగ్రత్తగా పనిచేసుకోవచ్చు.

ఇక ఈ సర్వేలో కొన్ని నియోజకవర్గాల్లో ఫలితాలు ఊహించని విధంగా వచ్చాయి. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ కంచుకోటగా ఉన్న మండపేట వైసీపీ గెలుచుకుంటుందని చెప్పింది. దీని బట్టి చూతే ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఇంకా కష్టపడాల్సి ఉంటుంది. గత మూడు ఎన్నికల్లో ఆయనే వరుసగా గెలుస్తూ వచ్చారు. కానీ తోట త్రిమూర్తులు ఇంచార్జ్ గా వచ్చాక మండపేటలో పరిస్తితులు మారాయి. లోకల్ ఎన్నికల్లో వైసీపీనే గెలిచింది. తాజా సర్వేలో మండపేట వైసీపీ ఖాతాలో పడుతుందని చెప్పింది.

అలాగే తూర్పు గోదావరిలో తుని, రామచంద్రాపురం సీట్లు కూడా వైసీపీ గెలుచుకుంటుందని చెప్పింది. అనూహ్యంగా టీడీపీ…ముమ్మిడివరం, కాకినాడ రూరల్, రాజమండ్రి సిటీ, అమలాపురం, ప్రత్తిపాడు, పెద్దాపురం, జగ్గంపేట, పి.గన్నవరం సీట్లు గెలుచుకుంటుందని సర్వేలో తేలింది. జనసేన వచ్చి పిఠాపురం, రాజమండ్రి రూరల్ లో గెలిచే ఛాన్స్ ఉందని చెప్పింది. ఇక రాజానగరం, అనపర్తి, కొత్తపేట, రాజోలు, కాకినాడ సిటీల్లో టఫ్ ఫైట్ ఉందని చెప్పింది. రాజోలులో జనసేన కాస్త ఎడ్జ్‌లో ఉందని, మిగిలిన సీట్లలో వైసీపీకి ఎడ్జ్ ఉందని చెప్పింది. అయితే ఈ సర్వే టీడీపీ-జనసేన విడివిడిగా పోటీ చేస్తే వచ్చే ఫలితాలు. కానీ కలిసి పోటీ చేస్తే రెండు పార్టీలు కలిస్తే ఎక్కువ సీట్లే గెలుచుకోవచ్చని తెలుస్తోంది. పొత్తు ఉంటే మండపేటలో వైసీపీ గెలుపు కష్టమవుతుంది.