తమ్మినేని వారసుడు దిగితే నష్టమేనా!

ఏపీలో నెక్స్ట్ ఎన్నికల్లో చాలామంది సీనియర్ నేతల వారసులు పోటీ చేయడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లోనే పలువురు నేతల వారసులు అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. రెండు పార్టీలకు చెందిన వారసులు బరిలో దిగారు. వీరిలో టీడీపీ వారసులు ఫెయిల్ అవ్వగా,వైసీపీ వారసులు సక్సెస్ అయ్యారు. ఇదే క్రమంలో వచ్చే ఎన్నికల్లో కూడా రెండు పార్టీల వారసులు పోటీకి దిగే అవకాశాలు ఉన్నాయి.

అలాగే స్పీకర్ తమ్మినేని సీతారాం వారసుడు చిరంజీవి నాగ్ కూడా పోటీ చేస్తారని ఎప్పటినుంచో ప్రచారం నడుస్తోంది. ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడైన తమ్మినేని…మొదట నుంచి టీడీపీలో పనిచేసి..తర్వాత ప్రజారాజ్యంలో చేరి…మళ్ళీ టీడీపీలోకి వచ్చారు. నెక్స్ట్ వైసీపీలోకి చేరారు. 2014లో ఆమదాలవలసలో పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో సత్తా చాటారు. అలాగే స్పీకర్‌ చైర్ దక్కించుకున్నారు. ప్రస్తుతానికి స్పీకర్ గా ఉన్నారు. స్పీకర్ గా ఉన్నా సరే సీతారాం దూకుడుగా ముందుకెళుతున్నారు. టీడీపీపై విరుచుకుపడుతూనే ఉన్నారు.

ఇక వచ్చే ఎన్నికల్లో తాను తప్పుకుని తన తనయుడుని ఆమదాలవలసలో పోటీ చేయించాలని తమ్మినేని చూస్తున్నారని తెలిసింది. కానీ ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. అదే ఆమదాలవలసలో తమ్మినేని బామ్మర్ది, టీడీపీ నేత కూన రవికుమార్ దూకుడుగా పనిచేస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో తన బావని ఎలాగైనా ఓడించాలని చూస్తున్నారు. ఇటీవల వస్తున్న సర్వేల్లో ఆమదాలవలసలో టఫ్ ఫైట్ నడిచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కొద్దో గొప్పో టీడీపీకే ఎడ్జ్ ఉందని సమాచారం.

ఇలాంటి పరిస్తితుల్లో తమ్మినేని వారసుడు గాని బరిలో దిగితే గెలుపు టీడీపీ వైపే ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఆమదాలవలసలో తమ్మినేనికి వ్యతిరేక వర్గాలు వైసీపీలో ఎక్కువగానే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో వారసుడుని బరిలో దింపితే సొంత పార్టీ వాళ్లే సహకరించే పరిస్తితి ఉండదని తెలుస్తోంది. మొత్తానికి తమ్మినేని వారసుడు బరిలో దిగితే వైసీపీకే నష్టం జరిగే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.