తెలుగు సీనియర్ హీరోల సంగతి అటకెక్కినట్టేనా… ఒక్క సినిమా ఆడటంలేదు?

టాలీవుడ్ లో సీనియర్ హీరోలు ఎవరు అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది చిరంజీవి, బాలకృష్ణ , నాగార్జున, వెంకటేష్. ఒకప్పుడు వీరి నుంచి సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ప్రేక్షకులు థియేటర్ల దగ్గర పండగ చేసుకునేవారు. ముఖ్యంగా అభిమానులైతే పూనకాలతో ఊగిపోయే పరిస్థితి. కానీ తరాలు మారే కొద్ది ప్రేక్షకుల అభిరుచులలో తేడాలు వచ్చేస్తున్నాయి. నేడు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోల హవానే నడుస్తోంది అనడంలో అతిశయోక్తి లేదు. వీరు ప్రస్తుతం ఇక్కడ టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు.

అయితే ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమని ఏలిన సీనియర్ హీరోల పని అయిపోయినట్టు కనబడుతోంది. ఎందుకంటే ఈ నలుగురు హీరోలు కూడా నేటితరం హీరోలతో పోటీ పడలేకపోతున్నారు అనే వార్త బాగా వినిపిస్తోంది. దీనికి అసలు కారణం ఈ మధ్యకాలంలో సీనియర్ హీరోలకు సరైన హిట్టు లేకపోవడం. అవును, చిరంజీవి రీయంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమా సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నప్పటికీ ఆ తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక వెంకటేష్ విషయానికి వస్తే.. సోలోగా హిట్ కొట్టి.. ఇప్పుడు సినిమాలలో ఆయన కనిపించడం లేదు.

ఇక నాగార్జున కూడా సోలో హిట్టు కొట్టి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇక ఇటీవల బాలయ్య మాత్రమే అఖండ సినిమాతో మంచి విజయం సొంతం చేసుకున్నారు. అయినా క్రేజ్ విషయంలో బాబాయ్ కంటే అబ్బాయే ముందున్నాడు. ఇకపోతే ఈ ముగ్గురు హీరోలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సోలోగా ఎంట్రీ ఇచ్చి.. పూర్వ వైభవాన్ని పొందితేనే ఈతరం హీరోలకు పోటీ ఇవ్వగలుగుతారు లేకపోతే ఇక వీరి తరం ముగిసినట్టే అంటూ వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.