మునుగోడు లో ఓటుకు 30 వేలా… నెల రోజుల్లోనే అన్ని కోట్ల మందు ఊదేశారా…!

తెలంగాణలోని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మునుగోడు ఉప‌ ఎన్నిక నేపథ్యంలో ఇప్పటికే ప్రధాన పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బిజెపి, టిఆర్ఎస్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇక్కడ నుంచి 2018 ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవితో పాటు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో మునుగోడు స్థానానికి ఉప ఎన్నిక‌ అనివార్యం అయింది. బిజెపిలో చేరిన రాజగోపాల్ రెడ్డి బిజెపి అభ్యర్థిగా పోటీ చేయటం దాదాపు ఖాయమైంది.

ఇక కాంగ్రెస్ నుంచి మాజీ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి రంగంలోకి దిగనున్నారు. టిఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది అధికారికంగా ఇప్పటి వరకు అయితే ఖరారు కాలేదు. మూడు పార్టీలకు ఈ ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకం కావడంతో.. ఇక్కడ డబ్బు ఏరులై పారుతోంద‌ని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఒక్కో ఓటర్ కు మూడు పార్టీల నుంచి దాదాపుగా 30000 వేలు ఇచ్చే ఛాన్సులు ఉన్నట్టు తెలుస్తోంది.

ఒక్క ఓటుకు 30 వేల రూపాయలు అంటే భారతదేశ చరిత్రలోనే ఈ ఉప ఎన్నిక అత్యంత ఖరీదైన ఎన్నికగా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓటుకు రూ. 30,000 వస్తుందన్న ప్రచారంతో కొత్త ఓటర్లు కూడా నియోజకవర్గంలో భారీగా పెరుగుతున్నారు. మరికొందరు ఇతర ప్రాంతాల నుంచి మునుగోడుకు తమ ఓటు హక్కును మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

గత నెల రోజుల్లో మునుగోడులో కొత్త ఓటుకు ఏకంగా 13 వేల అప్లికేషన్లు వచ్చాయంటేనే పరిస్థితి ఎలా ?ఉందో అర్థం అవుతుంది. ఇక నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతుంది. గత నెల రోజుల్లో కేవలం మద్యం అమ్మకాల ద్వారా రూ. 40 కోట్ల ఆదాయం వచ్చింది. ఉప ఎన్నిక తేదీ వస్తే మునుగోడులో మొత్తం డబ్బు ఏరులై పారుతోందని తెలుస్తోంది.

Share post:

Latest