అలనాటి నటి నిర్మలమ్మ గురించి ఈ సంగతి విన్నారా?

అలనాటి నటి నిర్మలమ్మ గురించి ఈ తరం ప్రేక్షకులకు తెలియదేమోగాని, నిన్నమొన్నటి 1970 మరియు 80 కిడ్స్ కి, అంతకు ముందు వారికి నిర్మలమ్మ బాగా సుపరిచితురాలు. అప్పట్లో ఏ సినిమాలో చూసినా ఆమె కనబడేది. అమ్మ గానో.. అత్తగానో మరేదైనా పాత్రలోనూ నిర్మలమ్మ కాసేపైనా సినిమాలలో మెరిసేవారు. ఇక ఆమె వృద్ధురాలిగా మారిన తర్వాత కూడా సినిమాలు ఆపలేదు. ఓ విధంగా చూసుకుంటే వృద్ధాప్యంలోనే ఆమె ఎక్కువగా సినిమాలు చేశారు. ఎన్నో వందల సినిమాల్లో అమ్మగా.. బామ్మగా నటించిన నిర్మలమ్మ ని ఇప్పటికి కూడా నిన్నటి తరం ప్రేక్షకులు గుర్తు పెట్టుకుని మరి ఇలాంటి ఒక బామ్మ మాకు కూడా ఉంటే బాగుండు అనుకునేవారు.
అయితే ఆమె సినిమా కెరీర్ మొదటి దశ అంటే, యుక్తవయస్సులో ఆమె హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. అయితే ఆమెకి మొదట్లో ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేదు. కొన్ని సినిమాల్లో నటించినా అవి ఒక మోస్తరుగానే ఆడాయి. కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో ఆమె టాలీవుడ్ లోని దాదాపు అందరూ స్టార్ హీరోలకు అమ్మగా అమ్మమ్మగా బామ్మగా నటించి మెప్పించారు. ఇకపోతే నిర్మలమ్మ అసలు పేరు రాజమణి, 1943 సంవత్సరంలో గరుడ గర్వభంగం అనే సినిమాతో చిన్న పాత్రలో కనిపించి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

దాదాపు 1000కి పైగా సినిమాల్లో నటించిన ఆమె 2009వ సంవత్సరంలో మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. పదో తరగతి వరకు చదువుకున్న నిర్మలమ్మకి 19వ ఏట వివాహం జరిగింది. చిన్నప్పటినుండి నాటకాల్లో ఆసక్తి చూపించిన ఆమెని తన పెదనాన్న సినిమాల వైపు ప్రోత్సహించారు. నాటకాలు వేసే సమయంలో నిర్మలమ్మ వయస్సు కేవలం 15 మాత్రమేనట. అయితే ఆమె సినిమాలలో బాగా రాణించినందుకు నాటకాలు బాగా పనికొచ్చాయట.