అరడజను ప్లాపులు వచ్చినా తగ్గని మాస్ మహా రాజా… ఎందుకంత స్పీడు?

దాదాపు ఓ దశాబ్దకాలంగా మాస్ రాజా రవితేజకి సరైన హిట్టు పడలేదనే చెప్పుకోవాలి. ఈమధ్యకాలంలో ఆయన చేసిన అరడజనుకు పైగా సినిమాలు ప్లాపులుగా నిలుస్తున్నాయి. అయినా మానవుడిలో మార్పు కనబడటం లేదు. వరుస సినిమాలకు సైన్ చేసుకుంటూ జెట్ స్పీడ్ తో ముందుకు వెళ్ళిపోతున్నాడు. సినిమా జయాపజయాలతో తేడాలేకుండా దూసుకుపోతున్నాడు. అయితే ఈ క్రమంలో రవితేజపై అనేక విమర్శలు వినబడుతున్నాయి. సరియైన కథని ఎంపిక చేసుకొని ఆచితూచి ముందుకు పోవచ్చుకదా అని అతని శ్రేయోభిలాషులు అంటున్నారు.

ప్రస్తుతం రవితేజ నటిస్తోన్న మూడు.. నాలుగు సినిమాలు సెట్స్ లో ఉన్నాయి. అందులో వరుసగా ధమాకా, రావణాసూర, టైగర్ నాగేశ్వరర్ షూటింగ్ దశలో ఉన్నాయి. వాటి పనుల్ని వీలైనంత త్వరగా పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. ఇక దొరికిన సమయంలో కథలు వింటూ నచ్చిన స్ర్కిప్ట్ ల్ని లాక్ చేస్తున్నారు. ఇటీవలే యంగ్ మేకర్ కం సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని చెప్పిన కథకి ఒకే చెప్పారు. ఆన్ సెట్స్ లో ఉన్న చిత్రాల షూటింగ్ పూర్తిచేసి ఈ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించాలని చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా మరో కొత్త సినిమాకి సంతకం చేసినట్లు తెలుస్తోంది. కమర్శియల్ డైరెక్టర్ సంపత్ నంది కథకి రాజా లాక్ అయినట్లు సమాచారం. ఇటీవలే సంపత్ రవితేజని కలిసి కథ వినిపించారట. స్టోరీ నచ్చడంతో రాజా మరో ఆలోచన లేకుండా వెంటనే ఒకే చెప్పినట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. ఇది పక్కా కమర్శియల్ ఎంటర్ టైనర్ అని అంటున్నారు. అయితే రవితేజ పాత్ర మాత్రం డిఫరెంట్ గా ఉంటుందిట.ఇప్పటికే ఈ కాంబినేషన్ లో గతంలో బెంగాల్ టైగర్ తెరకెక్కిన సంగతి తెలిసిందే.