టార్గెట్ కుప్పం: వైసీపీలో ‘టీడీపీ’..!

కుప్పం అంటే చంద్రబాబు కంచుకోట అని అందరికీ తెలుసు..వరుసపెట్టి ఏడు పర్యాయాలు బాబు అక్కడ విజయం సాధిస్తూ వస్తున్నారు. కానీ ఈ సారి మాత్రం కుప్పంలో బాబుకు ఖచ్చితంగా చెక్ పెట్టాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పం టార్గెట్ గానే రాజకీయం నడిపిస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడే మకాం వేసి..టీడీపీని దెబ్బ తీయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు.

ఇప్పటికే కుప్పంలో పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో వన్ సైడ్ గా గెలిచారు. కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. భారీ స్థాయిలో టీడీపీ శ్రేణులని వైసీపీలోకి తీసుకొచ్చారు. మొత్తానికి అన్నిరకాలుగా కుప్పంలో బాబుకు చెక్ పెట్టి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీని కూడా గెలుచుకోవాలని చుస్తున్నారు. ఇదే క్రమంలో జగన్ సైతం..అభ్యర్ధిగా భరత్ పోటీ చేస్తారని ప్రకటించారు. అలాగే గెలిస్తే మంత్రి పదవి కూడా ఇస్తానని ఆఫర్ ఇచ్చారు. ఇక ఇక్కడితో జగన్ వదిలేయలేదు. ఇప్పుడు కుప్పం పర్యటనకు వెళుతున్నారు. కుప్పం మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేయనున్నారు.

అలాగే కుప్పం వేదికగానే వైఎస్సార్ చేయూత మూడో విడత కార్యక్రమానికి బటన్ నొక్కుతారు. ఇక జగన్ సమక్షంలో భారీ స్థాయిలో టీడీపీ శ్రేణులు..వైసీపీలో చేరతారని తెలుస్తోంది. ఇక పేరు ఏదైనా గాని కుప్పంలో చంద్రబాబుకు చెక్ పెట్టడమే టార్గెట్ గా జగన్ టూర్ జరగనుంది. ఎలాగైనా ఆయన్ని నిలువరించే దిశగా జగన్ పనిచేస్తారు.

అందుకే టీడీపీ శ్రేణులని వైసీపీలోకి తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే..ఇప్పుడు వైసీపీలోకి వచ్చే టీడీపీ శ్రేణులు..వైసీపీకే ఓటు వేస్తారనే గ్యారెంటీ లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి..కొందరు భయపడి, లేదా పథకాలు పోతాయని వైసీపీ కండువా కప్పుకోవచ్చు అని..కానీ అసలు ఎన్నికలు వచ్చేసరికి వారు మళ్ళీ బాబు వైపే నిలబడతారని అంటున్నారు. అంటే వైసీపీలో ఉండే టీడీపీ వాళ్ళు..బాబుకే మద్ధతు ఇస్తారని చెప్పుకొస్తున్నారు.

Share post:

Latest