దూసుకెళ్లే జర్నీలో ఈ సడన్ బ్రేకుల లెక్కేంది జగన్..?

హైవే మీద వాహనం దూసుకెళుతున్న వేళ.. అవసరం లేకున్నా సడన్ బ్రేక్ వేస్తే ఏమవుతుంది? సాఫీగా సాగే జర్నీలో సడన్ బ్రేకుతో లాభం జరుగుతుందా? నష్టం జరుగుతుందా? అన్న ప్రశ్న వేస్తే సమాధానం ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. ఈ సడన్ బ్రేక్ కారణంగా జరిగే నష్టం ఊహించటానికి వీల్లేని రీతిలో ఉంటుంది. తెలివి ఉన్న వారెవరూ.. ఇలాంటి సాహసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోరు.

హైవే మీద మాంచి వేగంతో వెళ్లే బండిని సడన్ బ్రేక్ వేస్తే.. ఏమవుతుందో.. పాలనలో తన మార్కును చూపిస్తూ సాగిపోవాలని భావించే సీఎం.. లేనిపోని సమస్యల్ని కెలికి మరీ తన మీద పడేలా చేసుకోవటానికి అస్సలు ఇష్టపడరు. కానీ.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఇలాంటివి చేసేందుకు ఆయన ప్రదర్శించే మక్కువ అంతా ఇంతా కాదు. ఏదైనా అనుకోని సమస్య వస్తే.. అంతకు మించిన రీతిలో ఏదో ఒక ఇష్యూను తెర మీదకు తీసుకొస్తారన్న మైండ్ సెట్ ఆయనకు ఉందన్న ప్రచారం గురించి తెలిసిందే.

తాజాగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును మార్చాల్సిన అవసరం లేకున్నా.. దానికి తన తండ్రి వైఎస్సార్ పేరును పెట్టే ప్రయత్నం చేయటం.. దాని మీద జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. ముఖ్యమంత్రి జగన్ నిర్ణయంపై వైసీపీ నేతలు సైతం లోగుట్టుగా విస్మయానికి గురవుతున్నారు. మా సార్ ఏం ఆలోచిస్తుంటారో? అన్న మాట వారి నోటి నుంచి వినిపిస్తోంది. కెలికి మరీ సమస్యల్ని మీదేసుకోవటంలో జగన్ కు మించిన ముఖ్యమంత్రి మరొకరు ఉండదన్న విమర్శను ఆయన తరచూ ఎదుర్కొంటున్నారు.

ఇప్పటికే రాజధాని విషయంలో పీటముడి వేసుకొని కూర్చోవటం ద్వారా ఏపీ డెవలప్ మెంట్ దారుణంగా దెబ్బ తిందన్న మాట వినిపిస్తున్న వేళ.. అవసరం లేని అంశాలకు అనవసర ప్రాధాన్యతను ఇస్తూ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజల్లో ఆయనకున్న పలుకుబడిని మరింత తగ్గేలా చేస్తున్నారంటున్నారు. ఎన్టీఆర్ పేరును టచ్ చేయటం ద్వారా.. జగన్ ను అభిమానించే కొన్ని వర్గాలు వారు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సీఎంగా బాధ్యతలుచేపట్టిన నాటి నుంచి నిత్యం ఏదో ఒక వివాదంతొ ప్రజల్లో నానటమే తప్పించి.. డెవలప్ మెంట్.. ఏపీని ముందుకు తీసుకెళ్లేలా.. ఆయన పాలన ఉండటం లేదన్న విమర్శ ఉంది. ఎంతసేపటికి విపక్ష నేతను.. విపక్షాల్ని టార్గెట్ చేయటం.. వారి సంగతి చూసేందుకు ఎక్కువ ఆసక్తిని ప్రదర్శించటమే తప్పించి.. సెటిల్డ్ గా పాలన చేయాలన్న సోయి లేదన్న మాట తరచూ వినిపిస్తోంది.

ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్చటం వల్ల జగన్ కు ఒక్క ఓటు అదనంగా పడే అవకాశం లేదని.. ఆ మాటకు వస్తే.. నాలుగు ఓట్లు పోతాయని చెబుతున్నారు. మరి.. ఇలాంటి అవసరం లేని అంశాల్ని టచ్ చేసి.. విమర్శలు పాలు కావటంలోని గుట్టు ఏమిటి? అన్న ప్రశ్న పలువురి నోటి నుంచి వినిపిస్తోంది.

Share post:

Latest