జగన్‌కు అండగా చిరు-నాగ్..!

ఇటీవల ప్రముఖ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఎక్కువగా ఏపీలో జరుగుతున్న విషయం తెలిసిందే. సాధారణంగా సినిమా ఈవెంట్లు అన్నీ హైదరాబాద్‌లోనే జరుగుతాయి. ఎందుకంటే అది సినిమా అడ్డా కాబట్టి..సినీ ఇండస్ట్రీ మొత్తం అక్కడే ఉంది. అయితే సినిమాలకు ఆదాయం ఎక్కువ వచ్చేది మాత్రం ఏపీ నుంచి. అయినా సరే సినీ ఫంక్షన్లు అన్నీ హైదరాబాద్‌లోనే జరిగేవి.

అయితే జగన్ అధికారంలోకి వచ్చాక..సినిమా రంగానికి సంబంధించి ఏపీలో పెద్ద రచ్చ జరిగింది. మొదట టికెట్ల రేట్లు ఇష్యూ వచ్చింది. అలాగే బెనిఫిట్ షోల రగడ నడిచింది. ఇదంతా పవన్‌కు చెక్ పెట్టడానికి వైసీపీ చేస్తున్న పని అని జనసేన శ్రేణులు విమర్శలు చేశాయి. ఇదిలా ఉంటే సినీ పెద్దలుగా వ్యవహరిస్తున్న చిరంజీవి, నాగార్జున..జగన్‌తో సన్నిహితంగా ఉంటారనే సంగతి తెలిసిందే. ఇక వారే సినీ రంగానికి చెందిన సమస్యలని పరిష్కరించడానికి ప్రయత్నించారు. ముఖ్యంగా చిరంజీవి..సినిమా టికెట్ల విషయంలో మహేశ్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ లాంటి వారిని తీసుకెళ్లి జగన్‌తో భేటీ అయ్యేలా చేశారు.

అలాగే జగన్‌కు..చిరు చేతులు జోడించి మరీ వేడుకున్నారు. మొత్తానికి టికెట్ల విషయంపై రగడ తగ్గింది. ప్రస్తుతానికి ఎలాంటి వివాదం లేదు. ఇదే సమయంలో కొందరు హీరోల సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు హైదరాబాద్‌లో కాకుండా ఏపీలో జరిగేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా నాగార్జున, చిరంజీవి..ఇప్పటికే నాగార్జున బంగార్రాజు ఫంక్షన్ రాజమండ్రిలో జరుగగా, తాజాగా ఘోస్ట్ ఈవెంట్ కర్నూలులో జరిగింది.

ఇక చిరంజీవి గాడ్‌ఫాదర్ ఈవెంట్ అనంతపురంలో జరగనుంది. ఈ నెల 28న ఈవెంట్ జరగనుంది. ఏపీలో కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి..చిరంజీవిపై ప్రశంసల జల్లు కురిపించారు.  ‘గాడ్ ఫాదర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రాలో చేస్తుండటం సంతోషకరమని,  ఆయనకు శుభాకాంక్షలు అని, నాలుగున్నర దశాబ్దాలుగా చిత్రసీమను రంజిపజేస్తున్న మెగాస్టార్‌లో అదే ఉత్సాహం…ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమని విజయసాయి ట్వీట్ చేశారు. మొత్తానికి చిరు-నాగ్..జగన్‌కు గట్టిగానే సపోర్ట్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు.

Share post:

Latest