జనగణమన సినిమా ఆపేయడంతో ఛార్మికి భారీ నష్టం.. ఎంతంటే..?

విజయ్ దేవరకొండ, పూజా హెగ్డే కాంబినేషన్‌లో రూపొందుతున్న జనగణమన సినిమా తాజాగా అటకెక్కింది. పూరి జగన్నాథ్ ఈ సినిమాని మిలటరీ యాక్షన్ ఫిల్మ్ గా తీయాలనుకున్నాడు. వచ్చే ఏడాది ఆగస్టు 3న రిలీజ్ చేయాలనుకున్నాడు. కానీ లైగర్ సినిమా ప్లాప్ అయ్యాక ఈ సినిమా తీయకపోవడమే మంచిదని నిర్ణయించుకున్నాడు. అయితే ఈ మూవీ ఇప్పటికే ఒక హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌ను పూర్తి చేసుకుంది. ఇప్పుడది వేస్ట్ మెటీరియల్ గా మిగిలిపోయింది.

 

ఈ సీక్వెన్స్ తీసినందుకు నిర్మాతలకు భారీగా ఖర్చు కూడా అయ్యిందట. నిజానికి ఈ సినిమా కోసం వంశీ పైడిపల్లి పూరి జగన్నాథ్ తో కలిసి ఛార్మి కూడా బడ్జెట్ పెట్టుకుంది. అయితే ఇప్పుడా సినిమా అర్ధాంతరంగా ఆగిపోవటంతో ఆమెకు నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం ప్రకారం, హై ఇంటెన్స్ యాక్షన్ షెడ్యూల్ కోసం జనగణమన నిర్మాతలు టాప్ హాలీవుడ్ టెక్నీషియన్లను కూడా తీసుకున్నారు. ఆర్మీ ఆఫీసర్‌గా విజయ్‌ని చూపించడానికి హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకుని చాలా గ్రాండ్‌గా సీన్స్‌ను పూరి షూట్ చేయించాడట.

అయితే సినీ నటులకు, టెక్నీషియన్లకు చెల్లించిన అడ్వాన్స్‌లు మినహా నిర్మాతలు ఇప్పటివరకు ఈ మూవీ కోసం రూ.7-8 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు టాక్ నడుస్తోంది. ఆ అడ్వాన్స్‌లు తిరిగి వచ్చే అవకాశం ఉన్నా.. మేకింగ్ ఖర్చులను నిర్మాతలు భరించక తప్పదు. అలా చూసుకుంటే ఛార్మి కనీసం రెండున్నర కోట్లు నష్టపోయినట్టు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో సినిమా తీసి.. తీరా అది ఫెయిల్ అవుతే భారీ నష్టాలను చవిచూడక తప్పదు. దానికంటే ఆదిలోనే సినిమా ఆపేయడం బెటరని హీరోతో పాటు నిర్మాతలు కూడా ఒక నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. అందుకే ఒక్కొక్కరు ఈ రెండు కోట్లను వదులుకునేందుకు పెద్దగా ఆలోచించలేదని సమాచారం.