ఆ ఇంచార్జ్‌లకు బాబు షాక్?

నెక్స్ట్ ఎన్నికలని చంద్రబాబు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అందరికీ తెలిసిందే..ఈ సారి గాని గెలవకపోతే పార్టీ పరిస్తితి ఏం అవుతుందో కూడా బాబుకు బాగా తెలుసు. అందుకే గతానికి భిన్నంగా బాబు రాజకీయం చేస్తున్నారు. సొంత పార్టీలో జరిగే తప్పుల విషయంలో ఏ మాత్రం మెతక వైఖరితో ఉండటం లేదు. సరిగ్గా పనిచేయని నేతలని మొహమాటం లేకుండా పక్కన పెట్టేస్తానని చెప్పేస్తున్నారు.

ఈ సారి ఎన్నికల్లో గెలుపు అనేది చాలా కీలకం కాబట్టి…అందరూ నాయకులు కష్టపడి పనిచేయాలని లేదంటే నిస్సందేహంగా పీకి పక్కన పెట్టేస్తానని బాబు అంటున్నారు. అలాగే ఇటీవల వరుసపెట్టి రోజుకో నియోజకవర్గ ఇంచార్జ్‌తో బాబు సమావేశమవుతున్న విషయం తెలిసిందే. అలాగే నియోజకవర్గంలో పరిస్తితులని అడిగి తెలుసుకుంటున్నారు. ఇక తన దగ్గర రిపోర్ట్‌లో ఇంచార్జ్‌ల పనితీరు పట్ల పాజిటివ్ ఉంటే నెక్స్ట్ పోటీ చేసేది మీరే అని క్లారిటీ ఇస్తున్నారు. ఇక సరిగ్గా పనిచేయకపోతే..ఇంకా బాగా పనిచేయాలని, లేదంటే పక్కన పెట్టడానికి కూడా వెనుకాడనని చెప్పేస్తున్నారు.

ఇప్పటివరకు బాబు..46 ఇంచార్జ్‌లతో భేటీ అయ్యారు. తాజాగా  పాణ్యం, బనగానపల్లి, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జులు గౌరు చరితా రెడ్డి, బీసీ జనార్దనరెడ్డి, బడేటి రాధాకృష్ణలతో సమావేశం అయ్యారు. ఇక ఓవరాల్ గా ఇంచార్జ్‌లతో జరిగిన సమావేశాల్లో..బాబు…కొంతమందిపై సంతృప్తి వ్యక్తం చేస్తుండగా, మరికొందరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

పార్టీ శ్రేణులని కలుపుకుని వెళ్ళడం, ప్రజా సమస్యలపై పోరాటం చేసే విషయంలో కొంతమంది వెనుకబడి ఉన్నారని తెలుస్తోంది. అలాంటి వారికి బాబు గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.. పార్టీ ఆశించిన తీరులో పని చేయలేకపోతే తాము మరొకరిని చూసుకోవాల్సి వస్తుందని, పని చేయకపోయినా మోయడానికి తాము సిద్ధంగా లేమని ఆయన తేల్చి చెప్పేస్తున్నారట. అంటే బాబు ఎంత కఠినంగా ఉంటున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఇంచార్జ్‌ల పనితీరు గాని బాగోకపోతే మొహమాటం లేకుండా పక్కన పెట్టేసేలా ఉన్నారు.