వార్నింగ్ : ఇద్దరూ తగ్గట్లేదుగా!

ప్రత్యర్ధులపై విమర్శలు చేసే విషయంలో ఎంత దూకుడుగా ఉంటున్నారో…పార్టీని బలోపేతం చేసే విషయంలో ఎంత తెలివిగా వ్యవహరిస్తున్నారో…అలాగే సొంత పార్టీ నేతలు గాడి తప్పితే…వారిని గాడిలో పెట్టడానికి…వారికి డైరక్ట్‌గా వార్నింగ్ ఇవ్వడంలో ఇటు జగన్ గాని, అటు చంద్రబాబు గాని అసలు తగ్గడం లేదు. నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపు అనేది రెండు పార్టీలకు ముఖ్యమే. నెక్స్ట్ కూడా అధికారంలోకి రాకపోతే టీడీపీ పరిస్తితి ఏం అవుతుందో బాబుకు బాగా తెలుసు.

అలాగే పొరపాటున అధికారం కోల్పోయి, కసి మీద ఉన్న టీడీపీ అధికారంలోకి వస్తే ఏం అవుతుందో జగన్‌కు కూడా తెలుసు. అందుకే ఇద్దరు నేతలు…తమ తమ పార్టీలని బలోపేతం చేసుకుంటూ, సరిగ్గా పనిచేయని నేతలకు మొహమాటం లేకుండా వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. ఒకప్పుడు ఇలాంటి వార్నింగ్‌లు ఇచ్చే వారు కాదు…కానీ ఇప్పుడు రాజకీయం అలా మారిపోయింది. మరీ తీవ్రమైన పోటీ ఉండటంతో సొంత పార్టీ నేతలకు హెచ్చరికలు తప్పడంలేదు.

ఆ మధ్య వైసీపీ వర్క్ షాప్‌లో పనిచేయని నేతలకు మళ్ళీ ఎమ్మెల్యే సీటు ఇచ్చేది లేదని జగన్ గట్టిగానే చెప్పేశారు. ఇక ఇటీవల జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు సైతం…టీడీపీ నేతలకు గట్టిగా క్లాస్ పీకారు. ఇప్పటికీ రోడ్లపైకి వచ్చి పోరాడకపోతే వారికి సీట్లు ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పేశారు. కేసులకు భయపడేవారు ఇంట్లోనే కూర్చోవాలని చెప్పేశారు.

తాజాగా జగన్…కేబినెట్ సమావేశంలో గడప గడపకు సరిగ్గా వెళ్లకుండా, ప్రతిపక్ష టీడీపీ చేసే విమర్శలకు సరిగ్గా కౌంటర్లు ఇవ్వని మంత్రులకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. దూకుడుగా ఉండకపోతే మంత్రులని కూడా మార్చేస్తానని అన్నారు. అలాగే గడప గడపకు వెళ్లకపోతే ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వనని చెప్పేశారు. ఇటు తాజాగా చంద్రబాబు..కృష్ణా జిల్లా నేతలకు క్లాస్ ఇచ్చారు. చెన్నుపాటి గాంధీపై జరిగిన దాడిని ఖండించడం గాని, ఆయన్ని పరామర్శించడం, వైసీపీ దాడులని తిప్పికొట్టడంలో అలసత్వంతో ఉన్న నేతలకు గట్టిగా క్లాస్ ఇచ్చారు. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని, లేదంటే పక్కన పెట్టేస్తానని అంటున్నారు. మొత్తానికి ఇద్దరు అధినేతలు తమ సొంత పార్టీ నేతలకు గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు.