ఆ యువ ఎమ్మెల్యేకు సీనియర్ టెన్షన్?

అధికార వైసీపీలో అంతర్గత పోరు ఎక్కువగా ఉందనే సంగతి తెలిసిందే…చాలా నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతలకు ఒకరంటే ఒకరికి పడని పరిస్తితి. ఎవరికి వారు చెక్ పెట్టాలని చెప్పి రాజకీయం చేస్తున్నారు. కొన్నిచోట్ల సొంత పార్టీ ఎమ్మెల్యేల విధానాలు నచ్చాక చాలామంది వైసీపీ నేతలు తిరుగుబాటు చేసే పరిస్తితి. అలాగే కొన్ని చోట్ల సీటు విషయంలో నేతల మధ్య రచ్చ జరుగుతుంది. ఇదే క్రమంలో పెందుర్తి నియోజకవర్గంలో వైసీపీ యువ ఎమ్మెల్యే అదీప్ రాజ్ కు ఓ సీనియర్ నేత వల్ల పెద్ద టెన్షన్ మొదలైంది.

పెందుర్తిలో టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి బలం గురించి చెప్పాల్సిన పని లేదు. అలాంటి నాయకుడుని గత ఎన్నికల్లో అదీప్ చిత్తుగా ఓడించారు. అది కూడా జగన్ వేవ్ లో..అలా గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయిన అదీప్ రాజ్..తనకు ఇంకా పెందుర్తిలో తిరిగులేదనే విధంగా ముందుకెళుతున్నారు. ఇలా ఎప్పుడైతే తన బలాన్ని ఎక్కువగా ఊహించుకున్నారో అప్పటినుంచే సీన్ రివర్స్ అవ్వడం మొదలైంది.

ఎమ్మెల్యేగా మంచి పనితీరు కనబర్చి ప్రజల మద్ధతు పొందడంలో అదీప్ విఫలమవుతున్నారని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో జనాల్లో తిరగకపోవడం, ప్రజా సమస్యలు పరిష్కరించకపోవడం, కావల్సిన వారికే పథకాలు అందిస్తున్నారనే అపవాదు మూటగట్టుకోవడం లాంటి అంశాలు ఎమ్మెల్యేకు మైనస్ అవుతున్నాయి. ఇక ఇలాంటి తరుణంలోనే సీనియర్ నేత పంచకర్ల రమేష్ బాబు..పెందుర్తిలో ఎంట్రీ ఇచ్చి రాజకీయం చేయడం అదీప్ కు ఏ మాత్రం ఇష్టం లేదు.

గతంలో ఎలమంచిలి నుంచి టీడీపీ తరుపున గెలిచి ఎమ్మెల్యేగా పనిచేసిన పంచకర్ల..గత ఎన్నికల్లో ఓడిపోయి…ఆ తర్వాత టీడీపీకి దూరమయ్యారు. అలాగే వైసీపీలో చేరిపోయారు. ఇలా వైసీపీలో చేరిన పంచకర్లకు ఎలమంచిలి బాధ్యతలు ఇవ్వడం కష్టం..ఎందుకంటే వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఉన్నారు. ఇదే క్రమంలో ఆయన పెందుర్తిపై ఫోకస్ పెట్టారు. ఎందుకంటే 2009లో ప్రజారాజ్యం తరుపున పెందుర్తి నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత టీడీపీలోకి వెళ్ళి ఎలమంచిలి గెలిచారు.

అందుకే ఇప్పుడు తనకు పట్టున్న పెందుర్తిపై ఫోకస్ చేశారు..దీంతో అదీప్ కు అసంతృప్తి పెరిగిపోయిందని తెలుస్తోంది..ఈ మధ్య పంచకర్లపై డైరక్ట్ గా విమర్శలు చేశారు..తాము జగన్ సైనికులమైతే..పంచకర్ల జనసైనికుడు అంటూ కామెంట్ చేశారు..దీనిపై పంచకర్ల..వైసీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేయగా, అధిష్టానం అదీప్ కు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. మొత్తానికి అదీప్ రాజ్ కు పంచకర్ల వల్ల టెన్షన్ పెరిగిపోతుంది…ఆయన వల్లే సీటు కూడా చేజారిపోయే ప్రమాదం ఉంది.