రాజుగారి రాజీనామా..అసెంబ్లీ రద్దు!

వైసీపీ నుంచి ఎంపీ గెలిచిన రఘురామకృష్ణంరాజు…గత రెండేళ్లుగా అదే వైసీపీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్న విషయం తెలిసిందే..ఢిల్లీలో ఉంటూ వైసీపీ ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తున్నారు. ఇలా తమ పార్టీని గెలిచి తమపైనే విమర్శలు చేస్తున్న రాజుగారికి చెక్ పెట్టాలని వైసీపీ కూడా గట్టిగానే ట్రై చేస్తుంది. ఇప్పటికే ఒకసారి ఆయన్ని సి‌ఐ‌డి చేత అరెస్ట్ చేయించిన విషయం తెలిసిందే. అయినా సరే రఘురామ ఏ మాత్రం తగ్గకుండా ఢిల్లీలో ఉంటూ జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

అయితే ఆయనపై ఎలాగైనా అనర్హత వేటు వేయించాలని వైసీపీ చూస్తుంది. ఇప్పటికే విజయసాయిరెడ్డి పలుమార్లు లోక్‌సభ స్పీకర్‌కు కూడా ఫిర్యాదు చేశారు…కానీ ఆయనపై అనర్హత వేటు పడలేదు. ఇక ఇటీవల రఘురామ మరింత దూకుడుగా ముందుకెళుతున్నారు….ఈ మధ్య సర్వేల పేరిట వైసీపీ పని అయిపోయిందని చెప్పుకుంటూ వస్తున్నారు. టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతున్న రఘురామకు నైతిక విలువలు ఉంటే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని విజయిసయిరెడ్డి సవాల్ విసిరారు.

దీనిపై రఘురామ స్పందిస్తూ..తాను రాజీనామా చేయడానికి సిద్థమే అని, మళ్లీ పోటీ చేసి గెలుస్తానని, ఆతర్వాత సీఎం జగన్‌ తన ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఎన్నికలకు వెళ్లడానికి సిద్థమా? అని సవాల్‌ విసిరారు. దీనికి సంబంధించి జగన్..లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కోరారు. అయితే రఘురామ సవాల్‌ని వైసీపీ పట్టించుకునే అవకాశం లేదు. కాబట్టి రఘురామ ఎంపీ పదవికి రాజీనామా చేయడం అవ్వని పని, అలాగే జగన్ అసెంబ్లీని రద్దు చేయడం జరగని పని.

అయితే రఘురామని రాజీనామా చేయాలని డిమాండ్ చేసే ముందు..టీడీపీ నుంచి వచ్చిన నలుగురు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. మొత్తానికి చూసుకుంటే ఎన్నికల వరకు రఘురామ ఎపిసోడ్ కొనసాగేలా ఉంది. ఇక ఎన్నికలప్పుడు రఘురామ పొత్తు బట్టి టీడీపీ లేదా జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయి.

Share post:

Latest