అంబటి రాంబాబుకు పవన్ చెక్?

ఏ  వర్గం నేతలు…ఆ వర్గం నేతలనే తిడతారు…ఏపీ రాజకీయాల్లో ఇది సహజంగా జరిగే ప్రక్రియ. ఉదాహరణకు చంద్రబాబుని తిట్టాలంటే కమ్మ వర్గానికి చెందిన కొడాలి నాని ముందు ఉంటారు…అలాగే పవన్ ని తిట్టాలంటే కాపు వర్గానికి చెందిన నేతలు బయటకొస్తారు. వైసీపీలోని కాపు వర్గం నేతలు…ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు పెట్టి పవన్ పై ఫైర్ అవుతూ ఉంటారు. అందులో ముఖ్యంగా పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ లాంటి వారు ముందు ఉన్నారు.

అయితే అంబటి సెపరేట్ గా సెటైర్లు వేస్తూ ఉంటారు…ఈయన మంత్రిగా ఉన్నది కేవలం చంద్రబాబుతో పాటు పవన్ పై విమర్శలు చేయడానికే అన్నట్లు ఉంటారనేది రాజకీయ వర్గాల్లో చర్చగా ఉంది. మంత్రిగా ఏం చేస్తున్నారో ప్రజలకు పెద్దగా క్లారిటీ లేదు గాని..బాబు, పవన్ పై విమర్శలు చేయడంలో మాత్రం ఎప్పుడూ ముందే ఉంటారని చెప్పొచ్చు. ఏదైనా మీడియా సమావేశం పెడితే…తన శాఖకు సంబంధించి అంటే నీటి ప్రాజెక్టుల గురించి ఏమైనా చెబుతారేమో అని అంతా ఎదురుచూస్తారు.

కానీ అంబటి మాత్రం తన శాఖకు సంబంధించి తప్ప మిగతా విషయాలు గురించి చెబుతారు. ముందు నుంచి అంబటిది ఇదే తీరు. తాజాగా కూడా ఆయన పవన్ పై మరోసారి ఫైర్ అయ్యారు…ఈ మధ్య చేనేత వస్త్రాలకు డిమాండ్ పెరగాలని చెప్పి పవన్..చంద్రబాబు, బాలినేని శ్రీనివాస్, బీజేపీ నేత లక్ష్మణ్ లకు చేనేత వస్త్రాలు ధరించాలని ఛాలెంజ్ విసిరారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే బాలినేని ఛాలెంజ్ పూర్తి చేశారు.

అయితే దీనిపై అంబటి కామెంట్ చేశారు…చేనేత వస్త్రాల ఛాలెంజ్ ఆపి వచ్చే ఎన్నికల్లో 175 సీట్లలో పోటీ చేస్తున్నారో లేదో చెప్పాలని పవన్ ని డిమాండ్ చేశారు. దీనిపై జనసేన శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. చేనేత వస్త్రాలని ప్రమోట్ చేయడం అనేది మంచి కార్యక్రమం అని దాన్ని ఆపాలని అంబటి చెప్పడం సిగ్గు చేటు అని అంటున్నారు. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో లేదో తమ ఇష్టమని అంబటి ఎవరు చెప్పడానికి అని ప్రశ్నిస్తున్నారు.

అలాగే వచ్చే ఎన్నికల్లో అంబటిని ఖచ్చితంగా ఓడిస్తామని అంటున్నారు. గత ఎన్నికల్లో జనసేన శ్రేణుల ఓట్లని బ్రతిమాలడి వేయించుకున్నారని, ఈ సారి ఆ పరిస్తితి ఉండదని చెబుతున్నారు. అయితే టీడీపీతో జనసేన కలిస్తే ఈ సారి సత్తెనపల్లిలో అంబటి గెలుపు కష్టం అవ్వొచ్చు.

Share post:

Latest