లైగర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘లైగర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఏ రేంజ్ లో అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పూరీ జగన్నాత్ తనదైన మార్క్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించడంతో ఈ సినిమాపై బజ్ ఓ రేంజ్ లో క్రియేట్ అయ్యింది. ఇక పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావడంతో, ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ స్థాయిలో అందుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ:
కరీంనగర్ కు చెందిన బాలామణి(రమ్యకృష్ణ) తన కొడుకు లైగర్(విజయ్)ను మార్షల్ ఆర్ట్స్‌లో జాతీయ ఛాంపియన్‌గా నిలపాలని కోరుకుంటుంది. దీని కోసం ఆ తల్లీకొడుకులిద్దరూ తమ జీవిత ఆశయాన్ని సాధించాలని ముంబైకి వెళ్తారు. అయితే తొలుత లైగర్ తన కెరీర్ పై దృష్టి పెడతాడు. కానీ అతడి జీవితంలోకి తానియా(అనన్య పాండే) అనే అమ్మాయి ఎంట్రీ ఇవ్వడం.. అతడితో ప్రేమలో పడటం జరుగుతాయి. ఈ క్రమంలో లైగర్ కు తన గోల్ పై ఉన్న ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. అయితే తానియాతో లైగర్ కు మనస్పర్థలు రావడంతో వారిద్దరు దూరం అవుతారు. ఆ తరువాత MMA ఛాంపియన్ షిప్ కోసం లైగర్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు.. అతడికి ఎదురైన సవాళ్లు ఏమిటి.. వాటిని ఎలా అధిగమించాడు.. మైక్ టైసన్ కు లైగర్ తో ఎలాంటి సంబంధం ఉంటుంది.. చివరికి అతడి కలను లైగర్ అందుకుంటాడా అనేది ఈ సినిమా కథ.

విశ్లేషణ:
దర్శకుడు పూరీ జగన్నాధ్ టెంపర్ తరువాత ఆ స్థాయి సక్సెస్ అందుకోలేకపోయాడు. అయితే తన లాస్ట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ తో తిరిగి అదిరిపోయే సక్సెస్ అందుకున్నాడు. ఇక ఈ చిత్రం ఇచ్చిన విజయంతో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో కలిసి ‘లైగర్’ అనే పాన్ ఇండియా మూవీని తెరకెక్కించాడు. ఈ సినిమాకు నేషనల్ స్థాయిలో అదిరిపోయే క్రేజ్ ను తెచ్చిపెట్టాడు. అయితే ఈ సినిమా చూసినవారు మాత్రం పూరీ మళ్లీ తన సక్సెస్ ట్రాక్ తప్పాడని అంటున్నారు. ఇక లైగర్ మూవీ కథనం విషయానికి వస్తే.. ఫస్టాఫ్ లో హీరో, అతడి తల్లి చేసిన పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక తన కొడుకును మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ గా చూడాలని తన కొడుకును తీసుకుని ముంబైకి వెళ్తుంది.

అక్కడ లైగర్ మార్షల్ ఆర్ట్స్ ట్రెయినింగ్ తీసుకుంటున్న సమయంలో తానియా అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. దీంతో అతడి ఫోకస్ తగ్గిపోతుంది. ఈ క్రమంలో ఓ ఊహించని సంఘటన కారణంగా తానియాతో లైగర్ విడిపోతాడు. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ఓ సీక్వెన్స్ ఈ సినిమా సెకండాఫ్ పై కాస్త మంచి అంచనాలను క్రియేట్ చేస్తుంది. ఫస్టాఫ్ లో ప్రేక్షకులను అలరించే అంశాలు అక్కడక్కడా ఉండటంతో సెకండాఫ్ లోనైనా ఎంగేజింగ్ కంటెంట్ ఉంటుందని ప్రేక్షకులు ఆశించారు.

ఇక సెకండాఫ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఫస్టాఫ్ తోనే విసిగిపోయిన ఆడియెన్స్, సెకండాఫ్ లో ఎలాంటి ఎంగేజింగ్ కంటెంట్ లేకపోవడం.. ముందుగానే ప్రెడిక్ట్ చేసే సీన్స్ తో నింపేశాడు పూరీ. దీంతో సెకండాఫ్ లో కేవలం లైగర్ చేసే యాక్షన్ సీక్వెన్స్ లను చూసి తరించారు ఆడియెన్స్. ఇక ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ గురించి కూడా పెద్దగా చెప్పుకోవడనాకి ఏమీ లేదు.

ఓవరాల్ గా చూసుకుంటే.. లైగర్ చిత్రంపై పూరీ అండ్ టీమ్ క్రియేట్ చేసిన అంచనాలను అందుకోవడంలో చిత్ర యూనిట్ ఎక్కడా సక్సెస్ కాలేదు. ఒక్క విజయ్ దేవరకొండ మాత్రమే ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అతడి బాడీని మార్చుకున్న విధానం, డ్యాన్సులు, ఫైట్లు చేయడం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. మొత్తానికి లైగర్ సినిమాతో పూరీ పాన్ ఇండియా సక్సెస్ అందుకుంటాడని అందరూ అనుకుంటే, ఈ సినిమాతో అతడు మళ్లీ వెనకబడిపోవడం ఖాయమని చెప్పాలి.

నటీనటుల పర్ఫార్మెన్స్:
లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ వన్ మ్యాన్ షో కనిపిస్తుంది. ఈ సినిమాను తన భుజాలపై మోశాడని చెప్పాలి. నత్తి ఉన్న పాత్రలో, విజయ్ దేవరకొండ చేసిన పర్ఫార్మెన్స్ బాగుంది. ఇక మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేందుకు అతడు చేసే పనులు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇక రింగులోకి దిగాక మనోడు చేసే యాక్షన్ సీన్స్ సూపర్బ్. అటు డ్యాన్స్ స్టెప్పులతోనూ ఆడియెన్స్ ను కట్టిపడేశాడు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కూడా మంచి పాత్రలో నటించింది. ఆమె స్క్రీన్ స్పేస్, విజయ్ తో రొమాన్స్ బాగుంది. రమ్యకృష్ణ పాత్ర కూడా సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. ఇక తొలిసారి సినిమాల్లో నటించిన మైక్ టైసన్ పాత్రను మరికొంత సేపు వాడుకుని ఉండాల్సింది.

టెక్నికల్ డిపార్ట్ మెంట్:
పూరీ జగన్నాధ్ ఒక సినిమా సక్సెస్ అయ్యిందంటే, వెంటనే ఓ ఫెయిల్యూర్ ను మూటగట్టుకోవడం ఆనవాయితీగా మార్చుకున్నాడా? లైగర్ సినిమా చూస్తే అవుననే అనిపిస్తుంది. కథలో ఎలాంటి కొత్తదనం లేకపోవడం, కథనంలోనూ ఎలాంటి ఆసక్తికరమైన అంశాలు లేకపోవడంతో లైగర్ మూవీని అసలు పూరీనే డైరెక్ట్ చేశాడా అని అనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు ముగ్గురు సంగీత దర్శకుడు ఉన్నా, ఒక్క పాట కూడా ఆడియెన్స్ కు గుర్తుండదు. బీజీఎం కూడా పెద్దగా చెప్పుకునే స్థాయిలో లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. పూరీ కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

చివరగా:
లైగర్ – కొండన్నకు పౌడర్ ఏసిన పూరీ!

రేటింగ్:
2.25/5.0

Share post:

Latest