అచ్చెన్నని ఆపడం కష్టమే.. !

ఏపీ రాజకీయాల్లో కింజరాపు అచ్చెన్నాయుడు గురించి పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు…తన అన్న ఎర్రన్నాయుడుతో పాటు రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడు నుంచి అధ్యక్షుడు స్థాయికి ఎదిగిన నేత. అయితే అచ్చెన్న రాజకీయంగా ఎలాంటి విజయాలు అందుకున్నారో అందరికీ తెలిసిందే.. అలా రాజకీయంగా బలమైన అచ్చెన్నాయుడుకు చెక్ పెట్టాలని వైసీపీ గట్టిగానే ట్రై చేస్తుంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏ స్థాయిలో అచ్చెన్నని టార్గెట్ చేసిందో అందరికీ తెలిసిందే…అలాగే ఈ‌ఎస్‌ఐ స్కామ్ ఆరోపణలతో ఆయన జైలుకు కూడా వెళ్లారు.

ఇక జైలు నుంచి వచ్చాక అచ్చెన్న మరింత దూకుడుగా ముందుకెళుతున్నారు..పైగా ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి వచ్చాక…వైసీపీపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతూ వస్తున్నారు. ఇలా దూకుడుగా ఉన్న అచ్చెన్నని సొంత నియోజకవర్గం టెక్కలిలోనే ఓడించాలని వైసీపీ గట్టిగా ట్రై చేస్తుంది. గత ఎన్నికల్లో ఎలాగో అచ్చెన్నకు చెక్ పెట్టలేకపోయారు. ఈ సారైనా చెక్ పెట్టాలని వైసీపీ చూస్తుంది. మరి టెక్కలిలో అచ్చెన్నకు చెక్ పెట్టడం ఈజీనా? ఈ సారి టెక్కలిలో వైసీపీకి గెలుపు అవకాశాలుఎలా ఉన్నాయి? అనే అంశాలని ఒకసారి చూస్తే…

ప్రస్తుతం టెక్కలిలో అచ్చెన్న బలం పెద్దగా తగ్గినట్లు కనిపించడం లేదు. పైగా జైలు నుంచి వచ్చాక అచ్చెన్నపై సానుభూతి పెరిగింది. ఇక్కడ వైసీపీ ఇంచార్జ్ దువ్వాడ శ్రీనివాస్ దూకుడుగానే పనిచేస్తున్నారు. కాకపోతే ఆయన నోటికి ఎక్కువ పనిచెబుతున్నారు. ఎక్కువ పరుష పదజాలం వాడటం వల్ల వైసీపీకే మైనస్ అయ్యేలా ఉందని పోలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

అదే సమయంలో టెక్కలి వైసీపీలో గూపు తగాదాలు ఉన్నాయి. దువ్వాడ, పేరాడ తిలక్ వర్గాలకు పడని పరిస్తితి. ఈ వర్గ పోరు వల్ల వైసీపీకి నష్టమే తప్ప లాభం లేదు. ఇక  అచ్చెన్నకు ప్రజా బలం తగ్గకపోవడం వల్ల..టెక్కలిలోఈ సారి కూడా అచ్చెన్నని నిలువరించడం అంత ఈజీ కాదనే చెప్పొచ్చు.