తమ్ముడుకు ఛాన్స్ ఇస్తున్న కేశినేని

గత కొన్ని రోజులుగా టీడీపీలో ఎంపీ కేశినేని నాని వ్యవహారం బాగా హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే…గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన దగ్గర నుంచి ఈయన ప్రత్యర్ధి పార్టీ అయిన వైసీపీపై ఏ స్థాయిలో విమర్శలు చేశారో తెలియదు గాని, సొంత పార్టీపై బాగానే విమర్శలు చేశారు. అలాగే కొందరు నేతలని టార్గెట్ చేసి నాని విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి. ఇక సొంత తమ్ముడు కేశినేని శివనాథ్(చిన్ని) టార్గెట్ గా కూడా నాని ఫైర్ అయిన విషయం తెలిసింది…అప్పటినుంచి ఈ మధ్య ఢిల్లీకి వచ్చిన చంద్రబాబుకు బొకే ఇచ్చే విషయం వరకు నాని ఏదొక విధంగా వివాదాలు రేపుతూనే ఉన్నారు.

అయితే తాజాగా మీడియాతో మాట్లాడుతూ తాను అసంతృప్తితో లేనని షాక్ ఇచ్చారు. ఇక మీడియాను తన మీద ఫోకస్ చేయవద్దంటూ నాని సూచించారు. తన లాంటి నానిలు లక్ష మంది పుట్టుకొస్తారని చెప్పుకొచ్చారు. మరి ఈ మాటలో ఉన్న అర్ధం ఏంటో తెలియలేదు. తాను విజయవాడకు ఎంపీగా లేకపోయినా జరిగే నష్టం ఏమీ లేదంటూ మాట్లాడారు. అంటే నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేయనని చెబుతున్నారా? లేక తన తమ్ముడు చిన్నికి టీడీపీ అధిష్టానం టికెట్ ఇవ్వబోతుందా? అనేది తెలియడం లేదు.

అంటే ఇటీవల కాలంలో విజయవాడ ఎంపీ టికెట్ చిన్నిదే అని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే..దీనిపై నాని ఆ మధ్య బహిరంగంగానే విమర్శలు చేశారు. తన శత్రువుని ప్రోత్సహిస్తే…నేను మీ శత్రువుని ప్రోత్సహిస్తానని టీడీపీ అధిష్టానానికి కౌంటర్ ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు తాను విజయవాడ ఎంపీగా లేకపోయినా వచ్చే నష్టమేమీ లేదని అన్నారు. అంటే తన తమ్ముడుకు సీటు ఫిక్స్ అయిపోతుందని నాని భావించి…మాట్లాడినట్లు తెలుస్తోంది. అలాగే తాను ఇంకా పోటీ చేయనని పరోక్షంగా చెబుతున్నట్లు అర్ధమవుతుంది. మొత్తానికైతే కేశినేని నాని వ్యవహారం ఇంకా క్లారిటీ రావడం లేదు.