గంజితో చినబాబుకు కష్టమేనా?

రాజకీయాల్లో ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు…ఏ సమయంలో ఎవరికి ఎంత బలం ఉంటుందో చెప్పలేం. అసలు ఇంకా తిరుగులేదు అనుకునే నేతలు…కొంత ఓవర్ కాన్ఫిడెన్స్‌తో దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మంగళగిరిలో నారా లోకేష్ పరిస్తితి కూడా అలాగే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఊహించని విధంగా ఓటమి పాలైన నారా లోకేష్…మళ్ళీ మంగళగిరిలో గెలుపే లక్ష్యంగా పనిచేసుకుంటూ వస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడిపై వ్యతిరేకత పెరగడం, అమరావతి అంశం, లోకేష్ ప్రజల్లోకి వెళ్ళడం లాంటి అంశాలు…మంగళగిరిలో టీడీపీ గెలుపు దిశగా వెళుతుంది.

ఇలాంటి సమయంలో లోకేష్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ముందుకెళుతూ…మంగళగిరి టీడీపీలోని కొందరు నేతలని చేజార్చుకుంటున్నారని చెప్పొచ్చు. అందరినీ కలుపుకుని వెళితే ఎలాంటి ఇబ్బంది ఉండదు…కానీ చినబాబు కొందరు నాయకులని పక్కన పెట్టేస్తూ వచ్చారు. దాంతో ఆ నేతలు తమకు టీడీపీలో ప్రాధాన్యత లేదని చెప్పి వైసీపీలోకి వెళ్లిపోతున్నారు.

ఇప్పటికే మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు వైసీపీలోకి వెళ్లారు. ఈయన కాస్త ఔట్‌డెటెడ్ నేత కావడంతో లోకేష్‌కు పెద్దగా ఇబ్బంది లేదు. కానీ తాజాగా గంజి చిరంజీవి టీడీపీని వీడి వైసీపీలో చేరారు. మంగళగిరిలో బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న చేనేత వర్గానికి చెందిన గంజిని లోకేష్ పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల..గంజి తన దారి తాను చూసుకున్నారు.

2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి కేవలం 12 ఓట్లతో ఓడిపోయిన గంజి…2019 ఎన్నికల్లో చినబాబు కోసం సీటు త్యాగం చేశారు…అయినా సరే ఆయనకు టీడీపీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దీంతో ఆయన వైసీపీలోకి వెళ్లారు. గంజికి మంగళగిరిలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన ఏమి తక్కువ నాయకుడు కాదు…ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్న నేత అలాంటి నేతని వదులుకోవడం లోకేష్‌కు నష్టమే..అలాగే వైసీపీకి ప్లస్ అవుతుంది. మరి గంజి వల్ల చినబాబుకు మంగళగిరిలో ఎంత డ్యామేజ్ జరుగుతుందో చూడాలి.