ఎన్టీఆర్ ఫ్యామిలీకి అస్సలు కలిసిరాని ఆగస్టు నెల.. ఎందుకంటే

తెలుగు చిత్రసీమలో దివంగత ఎన్టీఆర్ పాత్ర ప్రముఖమైనది. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, కర్ణుడు ఇలా ఎన్నో పౌరాణిక పాత్రలలో ఆయన ఒదిగి పోయారు. రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారంటే ఎన్టీఆర్ మన కళ్ల ముందు మెదులుతారు. ఆ తర్వాత టీడీపీని స్థాపించి, ఏడు నెలల్లోనే అధికారం చేపట్టారు. తెలుగు వారి ఆత్మాభిమానాన్ని, గొప్పదనాన్ని నలు దిశలా చాటారు. అయితే ఆయన కుటుంబానికి మాత్రం ఎందుకో ఆగస్టు నెల ఏ మాత్రం కలిసి రాలేదు. రాజకీయంగా, కుటుంబ పరంగా ఎన్నో విషాధాలు వెంటాడాయి. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ఎన్టీఆర్-బసవతారకం దంపతులకు 8 మంది కుమారులు, నలుగురు కుమార్తెలు పుట్టారు. చిన్న కుమార్తె అయిన ఉమమహేశ్వరి సోమవారం (ఆగస్టు 1న) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె కంటే ముగ్గురు పెద్ద కుమార్తెలు లోకేశ్వరి, పురంధేశ్వరి, భువనేశ్వరి ఉన్నారు. నాలుగేళ్ల క్రితం సరిగ్గా ఇదే ఆగస్టు నెలలో నందమూరి హరికృష్ణ మరణించారు. రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఇక సీఎంగా ఉన్న ఎన్టీఆర్ గుండె శస్త్రచికిత్స కోసం అమెరికా వెళ్లిన సమయంలో ఆగస్టు నెలలోనే పార్టీలో సంక్షోభం తలెత్తింది. ఇలా రాజకీయంగా, కుటుంబ పరంగా ఆగస్టు నెల వారి కుటంబానికి తీరని నష్టం చేకూర్చింది.

ఇక ఎన్టీఆర్‌కు 8 మంది కుమారులు. వారిలో పెద్ద కుమారుడు రామకృష్ణ మృతి ఎన్టీఆర్‌ను బాగా కుదిపేసింది. షూటింగ్‌లో ఉండగా కుమారుడి మరణ వార్త తెలుసుకుని ఆయన కుంగిపోయారు. ఆ తర్వాత పుట్టిన కుమారుడికి జూనియర్ రామకృష్ణ అని నామకరణం చేశారు. మరో కుమారుడు హరికృష్ణ కూడా చనిపోయారు. ఇక తాజాగా ఆత్మహత్య చేసుకున్న ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి అంత్యక్రియలు బుధవారం జరగనున్నాయి.

అమెరికాలో ఉన్న ఆమె పెద్ద కుమార్తె కోసం కుటుంబ సభ్యులు నిరీక్షిస్తున్నారు. మానసిక ఒత్తిడితో ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకోవడం నందమూరి కుటుంబాన్ని తీవ్ర విషాదంలో నింపివేసింది.