పవన్-బాబు…వాళ్ళకు భలే హ్యాండ్ ఇచ్చారే!

రెండు తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టుల ఉనికి ప్రమాదంలో పడిన విషయం తెలిసిందే…ఒకప్పుడు ప్రజా పోరాటాలు చేస్తూ…రాజకీయంగా కూడా బలంగా ఉన్న కమ్యూనిస్టులు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సీటు కూడా గెలుచుకోలేని స్థ్తితిలో ఉన్నారు. పైగా కమ్యూనిస్టులని ఎవరికి వారు అవసరానికి వాడుకుని వదిలేస్తున్నారు. ఏపీలో కమ్యూనిస్టుల పరిస్తితి మరీ దారుణంగా ఉంది.

మొదట్లో ఉమ్మడి ఏపీలో సి‌పి‌ఐ, సి‌పి‌ఎం పార్టీలు టీడీపీతో పొత్తులో పోటీ చేసి కొన్ని సీట్లలో గెలిచేవి. 2004లో కాంగ్రెస్, మళ్ళీ 2009లో టీడీపీతో కలిసి పోటీ చేశాయి. 2014లో సింగిల్ గానే వెళ్ళాయి. ఇక 2018 తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీలతో కలిసి, 2019 ఎన్నికల్లో ఏపీలో జనసేనతో కలిసి పోటీ చేశాయి. ఎన్నికల తర్వాత కమ్యూనిస్టులు ఎవరికి వారే అన్నట్లు రాజకీయం చేస్తున్నారు. సి‌పి‌ఐ, సి‌పి‌ఎంలు కలిసి ముందుకెళ్లడం లేదు.

అయితే తెలంగాణలో మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో సి‌పి‌ఐ, సి‌పి‌ఎం లతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది. కానీ ఏపీలో రెండు పార్టీలు ఒంటరిగానే ఉన్నాయి. 2019 ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న పవన్…కమ్యూనిస్టులని పక్కన పెట్టేసి..తర్వాత బీజేపీతో జత కట్టారు. కానీ ఆ తర్వాత సి‌పి‌ఐ మాత్రం టీడీపీతో కలిసి పోరాటాలు చేస్తూ వచ్చింది. అమరావతి ఉద్యమం కావొచ్చు..ఇంకా పలు పోరాటాల్లో టీడీపీకి మద్ధతుగా నిలిచారు. అలాగే స్థానిక ఎన్నికల్లో అక్కడక్కడ టీడీపీతో కలిసి పోటీ చేసింది.

దీంతో నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేయొచ్చని సి‌పి‌ఐ భావించింది..కానీ బాబు..బీజేపీకి దగ్గరవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సి‌పి‌ఐ నేతలు బాబుపై ఫైర్ అవుతున్నారు. బాబుని ప్రజలు నమ్మరని, రాజకీయంగా నిలకడ లేదని నారాయణ విమర్శించారు. మొత్తానికి చూసుకుంటే కమ్యూనిస్టులకు బాబు హ్యాండ్ ఇచ్చేశారనే చెప్పొచ్చు. అవసరం ఉన్నవరకు సి‌పి‌ఐని వాడుకున్నారు…ఇప్పుడు బీజేపీ కోసం పాకులాడుతూ…కమ్యూనిస్టులని పక్కకు తోసేశారు.