దర్శకుడికి సారీ చెప్పిన ఉంగరాల జుట్టు సుందరి… అసలేం జరిగిందంటే?

మన తెలుగులో ఉంగరాల జుట్టు సుందరి అనగానే ఠక్కున గుర్తుకొచ్చేది అనుపమ పరమేశ్వరన్. అవును.. నిఖిల్ – అనుపమ పరమేశ్వరన్ నాయకానాయికలుగా నటించిన ‘కార్తికేయ 2’ ఇటీవలే థియటర్లలోకి వచ్చి దుమ్ముదులుపుతోంది. ఈ సినిమా ఇటు తెలుగు రాష్ట్రాలు సహా అటు హిందీ బెల్ట్ లోనూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన ప్రతిచోటా బాక్సాఫీస్ వద్ద హడావుడి చేస్తోంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో తాజాగా హైదరాబాద్ లో చిత్ర బృందం విజయోత్సవ వేడుకలు జరుపుకుంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు చందూ మొండేటికి అనుపమ పరమేశ్వరన్ క్షమాపణలు చెప్పింది. గుజరాత్ లో షూటింగ్ జరుగుతుండగా తనకు గాయాలయ్యాయని వెన్నునొప్పి ఎక్కువైందని చెప్పింది. షెడ్యూల్ చివరి రోజు సాంకేతిక సమస్య కారణంగా షూట్ ఆలస్యమైంది. అది తనను నిరాశపరిచిందని అనుపమ పేర్కొంది. అయితే ఈ విషయంలో తాను పశ్చాత్తాపపడుతున్నానని అనుపమ తెలిపింది. ఆరోజు అనుపమ తన ఆలోచనను తప్పు పడుతూ జీవితంలో చేసిన అతి పెద్ద మిస్టేక్ అని పేర్కొంటూ వేదికపై దర్శకుడికి క్షమాపణ చెప్పింది. తర్వాత తనకు మంచి పాత్ర ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపింది.

దేవాలయాల నేపథ్యం.. ద్వారక – శ్రీకృష్ణుని మహత్మ్యం నేపథ్యంలో అద్భుతమైన థ్రిల్లర్ కాన్సెప్టుతో ఈ చిత్రాన్ని చందూ తెరకెక్కించిన విధానానికి క్రిటిక్స్ నుంచి ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ- అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. కాల భైరవ సంగీతం అందించాడు. దిల్ రాజు- అల్లు అరవింద్ – బెక్కెం వేణుగోపాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇకపోతే నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా ’18 పేజీస్’ అనే రొమాంటిక్ డ్రామా షూటింగ్ చివరి దశలో ఉంది.

Share post:

Latest