తెరపైకి కోవిడ్ ఫైల్స్.. ఆర్జీవీ మరో సంచలన సినిమా

తన సినిమాలతో ప్రకంపనలు, సంచలనాలు, వివాదాలు రేపుతూ ఉంటాడు సెన్సేషనల్, కాంట్రవర్షియల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. ఆయన సినిమాలు అంటేనే సంచలనం, వివాదాలు అని చెప్పవచ్చు. వివాదాలు రేకుండా ఆయన సినిమా తీయరు. సినిమా ప్రకటించిన దగ్గర నుంచి రిలీజ్ అయ్యే వరకు రాంగోపాల్ వర్మ సినిమాలపై వివాదాలు నడుస్తూనే ఉంటాయి. కోర్టు, పోలీస్ కేసులు కూడా నమోదవుతూనే ఉంటాయి. ఈ వివాదాలతో ఆయన సినిమాలకు ప్రీ పబ్లిసిటీ వస్తూ ఉంటుంది. ఇంటర్వ్యూలతో, డిబేట్ లతో ఆర్జీవీ సినిమాలకు పెయిడ్ ప్రమోషన్స్, పబ్లిసిటీ అవసరం లేకుండా పోతోంది.

ప్రీ పబ్లిసిటీ వల్ల ఆర్జీవీతో సినిమా చేసే నిర్మాతలకు ప్రమోషన్స్ ఖర్చు కూడా తగ్గుతుంది. సామాజిక, రాజకీయ అంశాలు, నిజజీవితంలో జరిగే క్రైమ్ ఘటనలపై సినిమాలు తీసే ఆర్జీవీ.. తాజాగా మరో సంచలన సినిమా ప్రకటించాడు. కాశ్మీర్ ఫైల్స్ తరహాలో కోవిడ్ ఫైల్స్ సినిమా తీయబోతున్నట్లు ట్విట్టర్ లో ప్రకటించి ప్రకంపనలు రేపాడు. ప్రభుత్వాల అసమర్ధత, అజాగ్రత్త, అవినీతిని ఈ సినిమా ద్వారా బయటపెడతానని సంచలనం రేపాడు రాంగోపాల్ వర్మ.

కోవిడ్ ఫైల్స్ పొలిటికల్ సినిమా అని, కరోనా సమయంలో జరిగిన ఘటనలను, ప్రభుత్వ నిర్ణయాలు ఓటర్లపై చేసిన ప్రభావం వంటి అంశాలు ఇందులో ఉంటాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఆస్పత్రులు, మెడకిల్ మాఫియా దోపిడీ వంటి అంశాలను రాంగోపాల్ వర్మ చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అప్పటికే కరోనా వైరస్ పేరుతో ఆర్జీవీ ఓ సినిమా తీశాడు. ఇప్పుడే ఏకంగా కోవిడ్ ఫైల్స్ పేరుతో సినిమా తీయబోతున్నాడు. ఆర్జీవీ గతంలో 26/11 ముంబై ఎటాక్స్ పేరుతో సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాను చాలా ఎమోషనల్ గా తీశాడు. దానిని మించిన ఎమోషనల్ గా ఈ సినిమా ఉంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.