‘బింబిసారా’తో లెక్కలు తేలుస్తానంటోన్న కళ్యాణ్ రామ్!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బింబిసారా’ ఇప్పటికే తెలుగు ఆడియెన్స్ లో ఎలాంటి బజ్ క్రియేట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్, ట్రైలర్ ‘బింబిసారా’ చిత్రంపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ నయా లుక్ నందమూరి అభిమానులకు ఫుల్ కిక్కిస్తోంది. అయితే ఫాంటెసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ‘బింబిసారా’ను కొత్త దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో అనే సందేహం ఇండస్ట్రీ వర్గాల్లో నెలకొంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు కొందరు యాంటీ ఫ్యాన్స్ కళ్యాణ్ రామ్ మరో ఫ్లాప్ పట్టుకొస్తున్నాడంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు.

అయితే వారందరికీ చెంప ఛెళ్లుమనేలా కళ్యాణ్ రామ్ సరికొత్త ట్రైలర్ తో జవాబిచ్చాడు. ఈ రిలీజ్ ట్రైలర్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ రిలీజ్ చేశారు. ఇక ఈ రిలీజ్ ట్రైలర్ ఆద్యంతం పవర్ ఫుల్ డైలాగులతో, కళ్యాణ్ రామ్ పై పంచులేసిన వారికి గట్టిగా జవాబిచ్చే విధంగా ఉంది. అయితే ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ గెటప్ మొదలుకొని, ఆయన బాడీ లాంగ్వేజ్ గమనించినట్లయితే, ఆయన చాలా ఎనర్జిటిక్ గా మరియు యాంగ్రీ యాటిట్యూడ్ తో మనకు కనిపిస్తున్నాడు. ఇంతకాలం ఆయన వరుస ఫెయిల్యూర్స్ కారణంగా తనని ట్రోల్ చేసిన వారికి బింబిసారా రూపంలో సాలిడ్ యాన్సర్ ఇచ్చేందుకు ఫిక్స్ అయినట్లుగా కళ్యాణ్ రామ్ కనిపిస్తున్నాడు.

హిస్టారికల్ కాన్సెప్టును ప్రెజెంట్ కాలానికి మిక్స్ చేస్తూ దర్శకుడు వశిష్ఠ ఈ కథను తెరకెక్కించిన తీరు అత్యద్భుతంగా ఉందని ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చాడు. ఇక అల్ట్రా స్టైలిష్ లుక్ లో కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో కనిపిస్తుండటం, యాక్షన్ కు ఏమాత్రం కొదువే లేకపోవడం లాంటివి ‘బింబిసారా’ చిత్రాన్ని ఆసక్తికరంగా మారుస్తున్నాయి. ఆగస్టు 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ తన ప్రత్యర్థులకు ఎలాంటి సమాధానం ఇస్తాడో చూడాలి. ఇక ఈ సినిమాలో అందాల భామలు కేథరిన్ త్రేజా, సంయుక్తా మీనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.