టాలీవుడ్లో పెనుమార్పులు రాబోతున్నాయా? ఇదిగో క్లారిటీ!

తాజాగా జాతీయ అవార్డుల ప్రకటన జరగడం అందరికీ తెలిసినదే. తాజాగా దీనికి సంబంధించిన చర్చ టాలీవుడ్లో నడుస్తోంది. తెలుగు సినిమాకు సంబంధించి నాలుగు అవార్డులు వచ్చిన సంగతి అందరికీ విదితమే. ఇవి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో రాలేదని టాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి. అయినప్పటికీ గతంతో పోలిస్తే ప్రాంతీయ చిత్రాల క్రమంలో తెలుగు భాషకు దక్కినటువంటి ప్రాధాన్యం అన్నది కొంతమేరకు ఉపశమనం కలిగించే విషయమని సరిపెట్టుకుంటున్నారు.

పెద్ద సినిమాల (బాహుబలి, RRR) సంగతి పక్కన పెడితే.. మలయాళం నుంచి తమిళం నుంచి వస్తున్నటువంటి సినిమాల కథలలో ఉన్న నాణ్యతతో పోలిస్తే తెలుగు సినిమాల కథలలో నాణ్యత అంతగా లేదని విమర్శలు వస్తున్నాయి. ప్రాంతీయ చిత్రాల కేటగిరీకి సంబంధించి గతంలో కన్నా ఈ సారి కొంత ప్రాధాన్యం దక్కిన కూడా ఆశించిన మేర ఫలితాలు రాలేదని వీళ్లంతా ఆవేదన చెందుతున్నారు. తెలుగు సినిమా స్థాయి తెలుగు సినిమా గతి అన్నది కొంత మారినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రగతి అన్నది లేదు అన్నది ఓ విమర్శ.

తాజాగా ఈ జాతీయ పురస్కారాల ఫైనల్ జూరీలో ఉన్నటువంటి వి.ఎన్.ఆదిత్య ఓ వేదికగా మాట్లాడుతూ… సాధ్యమైనంత వరకూ కమర్షియల్ హంగులు లేని సినిమాలకే జ్యూరీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేసారు. ముఖ్యంగా మన దగ్గర కంటెంట్ బేస్ అంతా వసూళ్లు సాధించేందుకే అన్న విధంగా ఉంటుంది తప్ప సమాజానికి ఏమి చెబుదాం అన్న కోణంలో అస్సలు ఉండటం లేదని విమర్శలు చేసారు. ఆ మధ్య తీసినటువంటి కలర్ ఫొటో ఫక్తు ఫార్ములాలకు దూరంగా ఉండడమే ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో అవార్డు కొట్టేసింది. ఇదే సమయంలో మరిన్ని మంచి సినిమాలు వాస్తవిక దృక్పథంతో రూపుదిద్దుకుంటే మేలు అన్న అభిప్రాయం కూడా సినీ విశ్లేషకుల నుంచీ వినవస్తోంది.