తెగించైనా వంశీని ఓడిద్దాం అంటున్న వైసీపీ…!

పార్టీ మారిన టిడిపి రెబల్ ఎంపీ వల్లభనేని వంశీకి అధికార పార్టీ వైసీపీలో ముందు నుయ్యి వెనక గొయ్యి మాదిరిగా పరిస్థితి వుంది. టిడిపి నుంచి గెలుపొందిన వల్లభనేని వంశీ ని ఆప్యాయంగా అక్కున చేర్చుకున్న జగన్ అప్పటివరకు గన్నవరం నియోజకవర్గంలో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన నేతలను సంతృప్తి పరచలేకపోతున్నారు . దీంతో గన్నవరంలో వైసిపి రాజకీయం ప్రతి రోజు రగులుతూనే ఉంటుంది. ఇప్పటికే ఎన్నో సార్లు వంశీకి వైసీపీలో వంశీ ప్రత్యర్థులుగా ఉన్న నేతలకు మధ్య తాడేపల్లి ప్యాలెస్ లో పంచాయితీలు జరుగుతున్నా.. ఈ వర్గాల మధ్య వార్ మాత్రం ఆగడం లేదు.

వంశీ పై 2014 ఎన్నికల్లో పోటీ చేసిన దుట్టా రామచంద్రరావు, 2019 ఎన్నికల్లో పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు ఇద్దరూ ఇప్పుడు వైసీపీలో వంశీ ఆధిపత్యాన్ని సహించలేకపోతున్నారు . ఇటీవలే దుట్టా రామచంద్ర రావు అల్లుడు డాక్టర్ శివభరత్ రెడ్డి వైసీపీ పెద్దలు పిలిపించుకుని చర్చించారు .ఇదే సందర్భంలో వంశీని కూడా పిలిచి సర్దిచెప్పారు . విచిత్రం ఏమిటి అంటే ఈ పంచాయతీ తర్వాత ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు మరింత ముదిరి పోయాయి.

దీనికితోడు వంశీ పై గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన యార్లగడ్డ వెంకటరావు సైతం వచ్చే ఎన్నికల్లో వంశీ కి టిక్కెట్ ఇస్తే తాను ఎంత మాత్రం సహకరించను అని .. తానే ఎన్నికల్లో పోటీ చేస్తానని తెగేసి చెబుతున్నారు. మరోవైపు రామచంద్ర రావు సైతం ఇదే మాట మీద ఉన్నారు. దుట్టా రామచందర్ రావు అల్లుడు శివభరత్ రెడ్డి అయితే వంశీని పదేపదే కవ్వించేలా మాట్లాడుతూ రెచ్చగొడుతున్నారు. వంశీ టిడిపి పై ఎంతలా రెచ్చిపోతున్నారో అదేస్థాయిలో శివభరత్ రెడ్డి వంశీ పై రెచ్చిపోతుండడం గమనార్హం.

వంశీ మానసిక పరిస్థితి సరిగా లేకపోతే ఎక్కడైనా చూపించుకోవాలని కూడా శివభరత్ రెడ్డి సలహా ఇస్తున్నారు. డేరింగ్ డాషింగ్ నేత గా చెప్పుకునే వంశీకి ఇప్పుడు సొంత నియోజకవర్గంలోనే పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా మారింది. వంశీ కి అటు టీడీపీ లోకి వెళ్లే పరిస్థితి లేదు. వంశీ కి టీడీపీ లో ఎప్పుడో డోర్స్ క్లోజ్ అయిపోయాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేస్తానని పదేపదే ప్రకటించుకుంటున్నా పరిస్థితులు అయితే అంత సానుకూలంగా లేవు.

వైసీపీలో ఉన్న తన మిత్రుడు మాజీ మంత్రి కొడాలి నాని సహకారంతో మొన్నటి వరకు నెట్టుకొచ్చినా ఇప్పుడు నాని కి కూడా మంత్రి పదవి లేకపోవడంతో వంశీ పరిస్థితి కూడా ఆందోళనకరంగానే కనిపిస్తోంది.
ఓవైపు పార్టీ అధిష్టానం రామచంద్ర రావు , శివభరత్ రెడ్డి, యార్లగడ్డ వెంకట్రావుకు ఎంత సర్ది చెబుతున్నా వీరు మాత్రం నియోజకవర్గంలో వంశీ ని ఏమాత్రం లెక్క చేయడం లేదు. పైగా వంశీని ఒడిస్తామని వచ్చే ఎన్నికలలో వంశీకి వైసీపీ టిక్కెట్ ఇస్తే తాము సహకరించేది లేదని తెగేసి చెబుతున్నారు.

ఇక నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ కూడా మూడు వర్గాలుగా చీలిపోయింది. ఎవరికి వారు బలంగా ఉండటంతో పాటు ఇక టీడీపీ వాళ్లు సైతం ఎలాగైనా గట్టిగా కొట్టాలనే కసితో ఉండటం .. అది చూసిన వైసిపి వాళ్ళు కూడా వంశీకి పొగ బెడుతూ ఉండడంతో వంశీ ముప్పు తిప్పలు పడుతున్నాడు. ఏదేమైనా ఎన్నో ఆశలతో వైసీపీకి చేరువైన వంశీ పరిస్థితి పొయ్యి మీద పెనం లా మారిందనే చెప్పాలి.