రేవంత్ జోరు.. మ‌రో అభ్య‌ర్థి ఖ‌రారు.. సీనియ‌ర్ల బేజారు..!

కాంగ్రెస్ పార్టీ అవ‌ల‌క్ష‌ణాల‌న్నీ రేవంతుకూ ప‌ట్టుకున్నాయా..? పార్టీ బాధ్య‌త‌లు చేప‌ట్టి ఏడాద‌వుతున్నా త‌న ఒంటెత్తు పోక‌డ మార్చుకోవ‌డం లేదా.? త‌న దూకుడు నిర్ణ‌యంతో మ‌రో అభ్య‌ర్థిని ఖ‌రారు చేశారా..? దీంతో సీనియ‌ర్లు మ‌రోసారి రేవంతుపై గుర్రుగా ఉన్నారా..? అంటే పార్టీ వ‌ర్గాలు అవున‌నే స‌మాధానాలు ఇస్తున్నాయి.

రేవంత్ రెడ్డికి టీపీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి ఇవ్వ‌డ‌మే పార్టీలో చాలా మంది సీనియ‌ర్ల‌కు ఇష్టం లేదు. అయినా అధిష్ఠానం రేవంతుకే ఆ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది. అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన మ‌రుస‌టి రోజు నుంచే రేవంత్ పార్టీకి దూకుడు నేర్పించారు. శ్రేణుల్లో జోష్ పెంచారు. త‌న మొద‌టి ప‌ర్య‌ట‌న నిర్మ‌ల్ లో జ‌రిగింది. ప‌ట్ట‌ణంలో భారీ ర్యాలీ నిర్వ‌హించి మాజీ ఎమ్మెల్యే ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డిని అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించారు.

దీంతో కాంగ్రెస్ లో ఎప్పుడూ లేని సంప్ర‌దాయం రేవంత్ నెల‌కొల్పిన‌ట్లైంది. ఎన్నిక‌ల ముందు మాత్ర‌మే.. అదీ త్రీమెన్ క‌మిటీ ఖ‌రారు చేసిన వారికే టికెట్లు ఇచ్చే అల‌వాటు కాంగ్రెస్ లో ఉంది. కానీ ఈసారి అందుకు భిన్నంగా రేవంత్ మొద‌టి అభ్య‌ర్థిని నిర్మ‌ల్ లో ప్ర‌క‌టించారు. అప్పుడే మిగ‌తా సీనియ‌ర్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయినా రేవంత్ అంత‌టితో ఆగ‌కుండా.. పెద్ద‌ప‌ల్లి లో త‌న స‌న్నిహితుడు విజ‌య‌ర‌మ‌ణారావు.., భూపాల‌ప‌ల్లిలో కొత్త‌గా చేరిన గండ్ర స‌త్య‌నారాయ‌ణ‌రావును అభ్య‌ర్థులుగా ప్ర‌క‌టించారు.

దీంతో.. సీనియ‌ర్లు అగ్గిమీద‌గుగ్గిలం అయ్యారు. జ‌గ్గారెడ్డి, ఉత్త‌మ్‌, కోమ‌టి రెడ్డి, వీహెచ్‌, భ‌ట్టి త‌దిత‌ర సీనియ‌ర్లు రేవంత్ చ‌ర్య‌ల‌ను బ‌హిరంగంగానే వ్య‌తిరేకించారు. ఆయ‌న ఒంటెత్తు పోక‌డ‌పై తిరుగుబాటు బావుటా ఎగుర‌వేశారు. దీంతో అధిష్ఠానం రంగంలోకి దిగి అసంతృప్తుల‌ను బుజ్జ‌గించింది. స్వ‌యంగా రాహుల్ ఢిల్లీకి పిలుపించుకొని కొంద‌రినీ బుజ్జ‌గించి.. మ‌రికొంద‌రిని హెచ్చ‌రించారు. ఇక‌పై ఎవ‌రూ బ‌హిరంగంగా విమర్శ‌లు చేస్తూ మీడియాకు ఎక్క‌వ‌ద్ద‌ని హిత‌వు ప‌లికారు.

దీంతో ఇక‌పై పార్టీలో అంతా ఏక‌మ‌వుతార‌ని.. అసంతృప్తులు ఉండ‌వ‌ని భావించారు. కానీ రేవంత్ తాజా వ్యాఖ్య‌ల‌తో అది మొద‌టికొచ్చిన‌ట్లైంది. దాదాపు ఇర‌వై రోజులు అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉండి తిరిగొచ్చిన రేవంత్ రెండు రోజుల కింద‌ట ప‌రిగిలో పార్టీ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఇందులో ఆయ‌న వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఏడాదిన్న‌ర‌లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంద‌ని.. తానే నాయ‌క‌త్వం వ‌హిస్తాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

అంత‌టితో ఆగ‌కుండా.. పార్టీ అభ్య‌ర్థిని కూడా ఖ‌రారు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌రిగి నుంచి రామ్మోహ‌న్ రెడ్డి 50 వేల మెజారిటీతో గెలుస్తాడ‌ని జోస్యం చెప్పారు. దీంతో పార్టీలో అల‌జ‌డి చెల‌రేగింది. రేవంతు ఎక్క‌డిక‌క్క‌డ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తూ పోతే.. ఇక పార్టీలో మేమేందుక‌ని మిగ‌తా సీనియ‌ర్లు చిన్న‌బుచ్చుకున్నారు. బ‌య‌టికి విమ‌ర్శ‌లు చేయ‌క‌పోయినా లోలోప‌ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. రేవంత్ ఈ స‌మ‌స్య‌ను ఎలా ప‌రిష్క‌రిస్తారో వేచి చూడాలి.

Share post:

Popular