NTR కోసం ఆ ద‌ర్శ‌కులు క్యూ క‌ట్టేస్తున్నారా…!

Jr. NTR గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. వెనక నందమూరి లాంటి పెద్ద ట్యాగ్ ఉన్నప్పటికీ అది అతనికి ఏరకంగా ఉపయోగపడుతుందో వేరే చెప్పనవసరం లేదు. ఓరకంగా చెప్పాలంటే తన స్వశక్తితో ఎదిగాడు మన జూనియర్. తెలుగు సినిమా పరిశ్రమలో చెప్పుకోదగ్గ హీరోలలో ఎన్టీఆర్ ఒకరు. ఈయన నటించిన సినిమాలు దాదాపుగా ఆడుతాయి. అలనాటి సీనియర్ ఎన్టీఆర్ తరువాత ఆ కుటుంబంలో ఆస్థాయి చరిష్మా వున్న నటుడు జూనియర్ మాత్రమే అని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి లేదు.

ఇకపోతే మన జూనియర్ ఇపుడు వరుస సినిమాలను షురూ చేస్తున్నాడు. అందులో ఎక్కువగా తమిళ దర్శకుల పేర్లే వినబడుతున్నాయి. జూనియర్ తో సినిమాలు చేయడానికి అరవ దర్శకులు క్యూలు కట్టినట్టుగా టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేసేందుకు సిద్ధపడుతున్నాడు మన హీరో.

ఇక ఆ తరువాత ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోయే సినిమా కూడా ఫైనల్ అయ్యింది. అయితే కొరటాల శివతో సినిమా పూర్తి చేశాకనే, యంగ్ టైగర్ తన తదుపరి సినిమాని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించే అవకాశం వుంది. ఈ రెండు సినిమాల తరువాత వరుసగా తమిళ దర్శకుల పేర్లు వినబడుతున్నాయి. లోకేష్ కనగరాజ్, అట్లీ పేర్లు ఇపుడు ప్రచారంలోకి వచ్చాయి.

ఇప్పటికే ఎన్టీయార్‌కి వీరు కథల్ని నెరేట్ చేశారని, ఆ కధలు ఎన్టీఆర్ ఓకే చేసాడని అనుకుంటున్నారు. మరోపక్క, తాజాగా ఈ లిస్టులోకి ‘అసురన్’ ఫేం వెట్రిమారన్ వచ్చి చేరాడు. ఇటీవల వెట్రిమారన్ ఎన్టీఆర్ ని కలిసి ఓ కథను నేరేట్ చేయగా అది మన జూనియర్ కి పిచ్చి పిచ్చిగా నచ్చేసిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ అభిమానులు యెగిరి గంతేస్తున్నారు.