రానా “విరాట‌ప‌ర్వం” రివ్యూ అండ్ రేటింగ్

నటీనటులు: రానా దగ్గుబాటి-సాయిపల్లవి-ప్రియమణి-నందితా దాస్-నవీన్ చంద్ర-నివేథా పెతురాజ్-సాయిచంద్ తదితరులు
సంగీతం: సురేష్ బొబ్బిలి
ఛాయాగ్రహణం: డాని సాంచెజ్-దివాకర్ మణి
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
రచన-దర్శకత్వం: వేణు ఉడుగుల
రిలీజ్ డేట్‌: 17 జూన్‌, 2022

1990వ ద‌శ‌కంలో తెలంగాణ‌లో న‌క్స‌లిజం నేప‌థ్యంలో జ‌రిగిన ఓ య‌దార్థ సంఘ‌టన నేప‌థ్యంలో తెర‌కెక్కిన సినిమా విరాట‌పర్వం. స‌ర‌ళ అనే ఓ యువ‌తి న‌క్స‌లిజం వైపు ఆక‌ర్షితురాలు అయ్యి త‌న జీవితాన్ని ఎలా ప‌ణంగా పెట్టింద‌న్న విష‌యాన్ని వాస్త‌వ‌రూపంలో తెర‌పైకి తీసుకువ‌చ్చిన ప్ర‌య‌త్న‌మే ఈ విరాట‌ప‌ర్వం. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో స‌మీక్ష‌లో చూద్దాం.

క‌థ‌:
వెన్నెల (సాయిపల్లవి) వ‌రంగ‌ల్ జిల్లాలో న‌క్స‌లైట్లు వ‌ర్సెస్ పోలీసుల మ‌ధ్య వార్ న‌డుస్తోన్న టైంలో ఓ ప‌ల్లెటూర్లో పుడుతుంది. ఆమె పెరుగుతోన్న క్ర‌మంలో జ‌నం కోసం పోరాటం చేసే న‌క్స‌లైట్ ర‌వ‌న్న (రానా దగ్గుబాటి) గురించి తెలుసుకుని.. అతడి రచనలతో విపరీతంగా ప్రభావితం అయి త‌న‌కు తెలియ‌కుండానే ప్రేమ‌లో ప‌డుతుంది. అత‌డిని నేరుగా చూశాక అత‌డి కోసం త‌ల్లిదండ్రుల‌ను వ‌దిలేసి వ‌చ్చేస్తుంది. ప్రేమ అంటే ఇష్టం లేని ర‌వ‌న్న ఆమెను దూరం పెట్టాల‌ని చూస్తాడు.. కానీ ఆమె మాత్రం అత‌డి కోస‌మే ద‌ళంలో చేరుతుంది. ఎంతో ఇష్టంతో ద‌ళంలో చేరిన ఆమె జీవితం ఏమైంది ? అన్న‌దే ఈ సినిమా క‌థ‌.

విశ్లేష‌ణ :
సినిమా ఇండ‌స్ట్రీలో ప్ర‌తి ఒక్కరు క‌మ‌ర్షియ‌ల్ లెక్క‌లు వేసుకునే సినిమాలు చేస్తుంటారు. ఇది బిజినెస్ కావ‌డంతో అలా ఆలోచ‌న చేయ‌డంలో త‌ప్పులేదు. అయితే క‌మ‌ర్షియ‌ల్ లెక్క‌లు లేకుండా ఓ య‌దార్థ సంఘ‌ట‌న‌కు కాస్త సినిమాట్రిక్స్ అద్దినా వాస్త‌వంగా.. నిజాయితీగా చెప్పేందుకు చేసిన ప్ర‌య‌త్న‌మే ఈ విరాట‌ప‌ర్వం.

న‌క్స‌లిజం నేప‌థ్యంలో చాలా సినిమాలు చూడ‌డంతో ఓ మొనాటిని వ‌చ్చేసింది. అయితే ఈ సినిమాకు వెన్నెల క‌థ అద్ద‌డంతో కాస్త ఫ్రెష్ ఫీల్ వ‌చ్చింది. సాయిపల్లవి మార్కు అద్భుత నటనకు తోడు.. తర్వాత తర్వాత కొన్ని బలమైన సన్నివేశాలు పడడంతో ఆ పాత్రతో ట్రావెల్ అవుతాం. ఫ‌స్టాఫ్ అనేక ఇంట్ర‌స్టింగ్ సీన్ల‌తో ప్రేక్ష‌కుల‌ను ఎంగేజ్ చేస్తుంది.

సెకండాఫ్‌లో విరాట‌ప‌ర్వం ప్రేక్ష‌కుల‌ను కొంత ఇబ్బంది పెడుతుంది. హీరో హీరోయిన్లు ఎలా కలుస్తారా అన్న ఉత్కంఠకు తెరపడిపోయాక.. కథను ముందుకు తీసుకెళ్లడం దర్శకుడికి ఇబ్బంది అయ్యింది. ద‌ళంలో గొడ‌వ‌లు అన్నీ రొటీన్‌గానే ఉన్నాయి. కొంత‌ లిబర్టీస్ తీసుకున్న దర్శకుడు.. ముగింపు విషయంలో మాత్రం వాస్తవికంగా వెళ్లిపోయి థియేట‌ర్ల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే ప్రేక్ష‌కుల‌ను తీవ్ర భావోద్వేగానికి గురి చేశాడు.

నక్సలిజం నేపథ్యంలో ఒక హార్డ్ హిట్టింగ్ లవ్ స్టోరీగా వ‌చ్చిన ఈ విరాట‌ప‌ర్వం ఓ మంచి ప్ర‌య‌త్నం.. దీనిని ఖ‌చ్చితంగా అభినందించాలి. ఈ సినిమా అంతా సాయిప‌ల్ల‌వి వ‌న్ మ్యాన్ షో. ఎన్నో క్లోజప్ షాట్లతో ఆమె పలికించిన లోతైన హావభావాలకు ఫిదా అవ్వకుండా ఉండలేం. త‌ర్వాత ర‌వ‌న్న‌గా రానా త‌న పాత్ర‌కు న్యాయం చేశాడు. టెక్నిక‌ల్‌గా మ్యూజిక్‌, ఎడిటింగ్ బాగున్నాయి.

ఫైన‌ల్‌గా..
విరాట‌ప‌ర్వం అనేది నిజాయితీగా చెప్పిన‌ విప్ల‌వ ప్రేమ గాథ‌

విరాట‌ప‌ర్వం రేటింగ్ : 2.75 / 5

Share post:

Latest