థియేట‌ర్ గోడ‌కూలి చ‌నిపోయిన ఎన్టీఆర్ హీరోయిన్ ఎవ‌రంటే..!

కె.వి.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ ఫిలిం పాతాళ భైరవి కమర్షియల్‌గా సూపర్ హిట్టయింది. ఈ సినిమా తర్వాత హీరో ఎన్టీఆర్, విలన్ ఎస్వీ రంగారావు తన కెరీర్‌లో వెనుదిరిగి చూసుకోలేదు. కానీ ఈ మూవీలో హీరోయిన్‌గా నటించిన కె.మాలతి కెరీర్ మాత్రం అందుకు భిన్నంగా సాగింది. మాలతి 1926లో ఏలూరులో జన్మించింది. సుమంగళి, భక్త పోతన మూవీలతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత గాయనిగా కూడా పేరు తెచ్చుకుంది. పాతాళభైరవి సినిమాలో ఇందుమతి పాత్రను చక్కగా పోషించి మంచి పేరు తెచ్చుకుంది.

అయితే అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో కథానాయికగా నటించినా.. ఆ తర్వాత హీరోయిన్ అవకాశాలు ఆమెను వరించనేలేదు. కేవలం సైడ్ క్యారెక్టర్ రోల్స్ మాత్రమే ఆమెను పలకరించాయి. అవన్నీ కాదంటూ హీరోయిన్ అవకాశాల కోసమే ఆమె వేచి చూసింది. ఎన్ని రోజులు వేచి చూసినా లీడ్ రోల్ ఆఫర్స్ రాకపోవడంతో పేరంటాలు, అగ్ని పరీక్ష అనే సినిమాల్లో చిన్న పాత్రలు చేసేందుకు ఒప్పుకుంది. అనంతరం కన్నడ హీరో రాజ్ కుమార్‌తో కలిసి కాళహస్తి మహాత్యం (1954)లో నాయికగా నటించింది. అదే ఆమె చివరిసారిగా ఫిమేల్ లీడ్ రోల్‌లో నటించడం.

ఈ సినిమా తర్వాత ఆమె 13 చిత్రాల్లో అక్క, వదిన, పిన్ని వంటి క్యారెక్టర్ రోల్స్‌లో యాక్ట్ చేసింది. ఆమె నటించిన చివరి చిత్రం శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం. ఈ సినిమాలో ఆమె జూనియర్ ఆర్టిస్ట్ కంటే తక్కువ ప్రాధాన్యత గల పాత్రను పోషించింది. అయితే ఒక్కసారిగా ఆమె కెరీర్ తలకిందులు కావడంతో ఆర్థికంగా చితికిపోయింది. అప్పట్లో సినిమా షూటింగ్స్ చెన్నై నుంచి హైదరాబాద్ కి తరలి వచ్చాయి. సినీ ఆఫర్స్‌ కోసం మాలతి కూడా భాగ్యనగరానికి వచ్చింది.

ఆ టైమ్‌లో ఆమెకు చేతిలో ఆఫర్లు లేవు. ఒక ఇంటిని రెంట్‌కి తీసుకునే ఆర్థిక స్థోమత కూడా లేదు. దాంతో ప్రభాస్ థియేటర్ వెనుక ఉన్న గోడకు ఆనుకుని ఓ రేకుల షెడ్డు ఏర్పాటు చేసుకొని తలదాచుకుంది. అక్కడే ఉంటూ ఆఫర్స్ కోసం స్టూడియోల చుట్టూ కాళ్లరిగేలా తిరిగేది కానీ ఎవరూ ఒక్క చిన్న ఆఫర్ కూడా ఇవ్వలేదు. అదే సమయంలో భర్త తనువు చాలించడంతో ఆమె పరిస్థితి మరింత దయనీయంగా మారింది. అప్పటికి ఆమెకు పిల్లలు ఎవరూ లేరు. చేతిలో చిల్లిగవ్వ లేని ఆ పరిస్థితుల్లో ఆమె సమీపంలోని ఓ గుడికి వెళ్లి అక్కడ ప్రసాదాలను తిని కడుపు నింపుకునేది.

అయితే 1979 నవంబర్ 22న వచ్చిన భారీ వర్షానికి ప్రభాస్ థియేటర్ గోడలు కూలిపోయాయి. ఈ ప్రమాదంలో మాలతి కన్నుమూసింది. అయితే రోజూ ప్రసాదాలకి వచ్చే మాలతి రెండు రోజులుగా కనిపించకపోవడంతో పూజారి ఆమె గురించి ఆరా తీశారు. అప్పుడే అతనికి ఆమె థియేటర్ వెనుక ఉంటుందనే విషయం తెలిసింది. దాంతో ఆమె శిథిలాల కింద పడి ఉంటుందేమోనని అతను అందరికీ చెప్పారు. విషయం తెలిసిన స్థానికులందరూ ఆ శిథిలాలను తొలగించగా వాటి కింద ఆమె విగతజీవిగా కనిపించింది. ఆమె పక్కనే ఒక పెద్ద పెట్టె దొరికింది. ఆ పెట్టె తెరిచి చూడగా అందులో పాతాళభైరవి సినిమా ఫొటోలు, ఆమె చేసిన మిగతా సినిమాల వివరాలు, ఆమె పొందిన అవార్డులు కనిపించాయి. అలాగే ఒక డైరీ కూడా దొరికింది. ఇందులో ఆమె తాను అనుభవించిన బాధల గురించి రాసుకొచ్చింది.

ఒకప్పుడు వెండితెరపై యువరాణిలా కనిపించి ఎందరో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచేసిన మాలతి చివరికి ఒక అనాథలా, దిక్కులేని దానిలా చనిపోవడం చూసి చాలామంది కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె బతికి ఉన్నప్పుడు సాయం చేయని సినీ పెద్దలు ఆమె చనిపోయిన తర్వాత అంత్యక్రియల కోసం కూడా ఆర్థిక సహాయం చేయలేదని అప్పట్లో విమర్శలు వచ్చాయి. కనీసం ఆమె గురించి ఒక సంతాప ప్రకటన చేసిన సీనియర్ నటులు కూడా లేకపోవడం అందర్నీ కలచివేసింది. ఆమె గురించి న్యూస్ పేపర్లలో కూడా పెద్దగా వార్తలు రాకపోవడం గమనార్హం.