ఆ వైసీపీ సీనియ‌ర్ ఎమ్మెల్యే టంగ్ యూట‌ర్న్‌.. మంత్రి పీఠం కోస‌మేనా..?

ఆయ‌న సీనియ‌ర్ మోస్ట్ ఎమ్మెల్యే, గ‌తంలో మంత్రిగా కూడా ప‌నిచేశారు. ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్నారు. అ యితే.. అనూహ్యంగా ఆయ‌న నాలిక యూట‌ర్న్ తీసుకోవ‌డం.. వైసీపీకి అనుకూలంగా వ్యాఖ్య‌లు చేయ‌డం వంటివి రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. ఆయ‌నే నెల్లూరు జిల్లా వెంక‌టగిరి నియోజ‌క వ ర్గం .. నుంచి గెలిచిన ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి. కాంగ్రెస్‌లో మంత్రిగా ప‌నిచేసిన ఆనం.. త‌ర్వాత‌.. రాష్ట్ర విభ‌జ‌న‌తో కొన్నాళ్లు మౌనంగా ఉన్నా.. త‌ర్వాత‌.. టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. వైసీపీలోకి వ‌చ్చిన ఆయ‌న వెంక‌ట‌గిరి టికెట్ తీసుకుని విజ‌యంద‌క్కించుకున్నారు.

అయితే.. ఎమ్మెల్యే అయిన‌ప్ప‌టికీ.. సొంత పార్టీ నేత‌ల‌పైనా.. అధికారుల‌పైనా.. ప్ర‌భుత్వంపైనా విరుచు కుప‌డిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. నియోజ‌క‌వ‌ర్గం నిధులు ఇవ్వ‌డం లేద‌ని.. అన్నీ వ‌లంటీర్లే చేసుకుంటే.. ఎమ్మెల్యేలు ఏంచేయాల‌ని.. అధికారులు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని… ఇలా.. అనేక రూపాల్లో ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. నేరుగా ముఖ్య‌మంత్రిపై ఏమీ కామెంట్లు చేయ‌క‌పోయినా.. అంత‌ర్గ‌తంగా మాత్రం అక్క‌సు వెళ్ల‌గ‌క్కారు. దీంతో స్వ‌ప‌క్షంలో విప‌క్ష నాయ‌కుడిగా.. ఆనం పేరు తెచ్చుకున్నారు. మ‌రోవైపు… మీడియా ముందుకు ఎప్పుడు వ‌చ్చినా.. స‌ర్కారుపై విమ‌ర్శిస్తారనే పేరు ఉంది.

ఇటీవ‌ల జిల్లాల విభ‌జ‌న స‌మ‌యంలోనూ నాలుగు మండ‌లాల విష‌యంలో బ‌హిరంగ విమ‌ర్శ‌లే చేశారు. ఇక‌, దీంతో ఆనం మారేది లేదు.. అని అంద‌రూ అనుకున్నారు. అయితే.. ఇలాంటి స‌మ‌యంలో ఆనం ఒక్క‌సారిగా యూట‌ర్న్ తీసుకున్నారు. సొంత పార్టీ వైసీపీపై తీవ్ర ప్రేమ‌ను కురిపించారు. అంతేకాదు. ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీని ఎన్ని విదాల దూషించినా.. సీఎం జ‌గ‌న్‌ను ఎంత తిట్టిపోసినా.. ప్ర‌తిప‌క్షాల గురించి ప‌న్నెత్తు మాట అన‌ని.. ఆనం.. తాజాగా విరుచుకుప‌డ్డారు. అంతేకాదు.. సీఎం జ‌గ‌న్‌ను కూడా ఆకాశానికి ఎత్తేశారు.

సీఎం జగన్ నుంచి కిందిస్థాయి నేతల వరకు.. ప్రతి ఒక్కరిని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం చేసే ప్రతి పనిని ప్రతిపక్షాలు, శ్రీలంక ఆర్థిక పరిస్థితితో పోల్చుతున్నా యని తప్పుబట్టారు. ఐదున్నర కోట్లమంది ప్రజలు ఉన్న ఈ రాష్ట్రంలో.. సంక్షేమం ఏనాడూ వెనుకబడ లేదని తెలిపారు. లక్షా 20 వేల కోట్లతో ప్రజా సంక్షేమం కోసం బడ్జెట్‌ పెట్టామని చెప్పారు. ప్రజలంతా ప్రతిపక్షాలను నిలదీయాలని రామ‌నారాయణరెడ్డి పిలుపునిచ్చారు.

ఈ హ‌ఠాత్ ప‌రిణామంతో అనేక విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. ఆనం మార్పు వెనుక రీజ‌న్ ఏంటి? అని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. దీని వెనుక బ‌ల‌మైన కార‌ణం ఉండి ఉంటుంద‌ని చెబుతున్నారు. మొత్తానికి మంత్రి వ‌ర్గ కూర్పు స‌మ‌యంలో ఈ మార్పు చూసిన‌వారు.. కేబినెట్‌లో బెర్త్ కోస‌మే.. ఇలా చేస్తున్నారా? అనే సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.