ఎన్టీఆర్ మా అధ్య‌క్షుడు ఎందుకు కాలేదు… ఏం జ‌రిగింది..!

అన్న‌గారు కోల్పోయిన అవ‌కాశం అంటే.. చాలా మందికి ఆశ్చ‌ర్యం క‌లిగించి ఉంటుంది. కానీ, అన్న‌గారు అత్యంత కీల‌క‌మైన అవ‌కాశం మాత్రం చేజార్చుకున్నారు.. అయితే.. అందులో.. ఆయ‌న దురుద్దేశం ఏమీ లేదు. త‌న‌కు అవ‌కాశం ద‌క్క‌క‌పోయినా.. ఫ‌ర్వాలేదు.. కానీ.. న‌టీన‌టులు అంద‌రూ క‌లిసి మెలిసి ఉండాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. అదే.. ఆయ‌న‌కు అత్యంత కీల‌క‌మైన అవ‌కాశాన్ని చేజార్చుకునే ప‌రిస్థితిని క‌ల్పించింద‌ని అంటారు. అదే.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అన్న గారి హ‌యాంలోనే.. అంటే.. 1983లో ఎన్టీఆర్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన‌ప్పుడు.. మ‌ద్రాస్ నుంచి తెలుగు క‌ళాకారుల‌ను హైద‌రాబాద్‌కు వ‌చ్చేలా..ఇక్క‌డే షూటింగులు చేసేలా అన్న‌గారు ప్రోత్స‌హించారు.

అంతేకాదు.. ఇక్క‌డే అనేక స్టూడియోలు క‌ట్టుకునేందుకు ఆయ‌న ప్ర‌భుత్వంలోనే ఉదారంగా అత్యంత త‌క్కువ ధ‌ర‌ల‌కే.. స్థ‌లాల ను ఇచ్చారు. అదేవిధంగా ప్ర‌భుత్వం త‌ర‌ఫున నిర్మాణాల‌కు కూడా అనుమ‌తులు మంజూరు చేశారు. దీంతో అక్కినేని నాగేశ్వ‌ర రావు.. అన్నపూర్ణ స్టూడియో నిర్మించుకున్నారు. అదేవిధంగా వాహినీ సంస్థ జెమినీ పేరుతో హ‌ద‌రాబాద్‌లో స్టూడియో నిర్మిం చింది. అలాగే.. కృష్ణ ప‌ద్మాల‌యా స్టూడియోను నిర్మించుకున్నారు. ఇక‌, కృష్ణంరాజు కూడా.. స్డూడియో నిర్మించుకున్నారు.

ఇలా.. చాలా మంది సంస్థ‌ల‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే తెలుగు న‌టీన‌టులు ఒక సంఘంగా ఏర్పడాల‌ని అన్న‌గారిని కోరారు. అంటే.. అప్పుడే.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఏర్పాటుకు బీజం ప‌డింది. అంతేకాదు.. సీఎంగా ఉన్న అన్న‌గారి చేతుల మీదుగానే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని భావించారు. దీనికి తొలి అధ్య‌క్షుడిగా.. ఏక‌గ్రీవంగా అన్న‌గారినే ఎన్నుకోవాల‌ని.. అప్ప‌ట్లో అక్కినేని, కృష్ణ‌, కృష్ణంరాజు, రావు గోపాల‌రావు, మోహ‌న్‌బాబు..ఇలా చాలా మంది నటీన‌టులు కోరుకున్నారు. వీరిలో ప్ర‌ముఖ న‌టి జ‌మున కూడా ఉన్నారు.

అయితే.. అన్న‌గారు దీనికి స‌సేమిరా అన్నారు. “మ‌నం ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ద్రాస్‌లో అక్క‌డి క‌ళాకారుల‌తో క‌లిసి ప‌నిచేశాం. మున్ముందు కూడా ప‌నిచేయాలి. అంతే త‌ప్ప‌.. మ‌న‌కంటూ.. సంఘాలు పెట్టుకుంటే.. వారిని వేరు చేసిన‌ట్టు అవుతుంది.. ఇది మంచిదికాదు.. పైగా ఇలా సంఘాలు ఏర్పాటు చేసుకుంటే.. మ‌న‌లో మ‌న‌కు కూడా ఘ‌ర్ష‌ణ‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది.“ అని వ‌ద్ద‌న్నార‌ట‌.

దీంతో అన్న‌గారు అధ్య‌క్షుడు అయ్యే అవ‌కాశం లేక‌పోగా.. అస‌లు `మా` ఏర్ప‌డ‌లేదు. అయితే.. ఎట్ట‌కేల‌కు మ‌ళ్లీ 1993లో ఇది ఏర్ప‌డింది. అయితే.. అప్ప‌టికి .. అన్న‌గారు పూర్తిగా రాజ‌కీయాల్లో ఉండ‌డంతో దీనిని ఆయ‌న ప‌ట్టించుకోలేదు. పైగా తాను వ‌ద్ద‌న్నా.. దీనిని ఏర్పాటు చేయడంతో ఆయ‌న దీనిలో స‌భ్య‌త్వం కూడా తీసుకోలేదు. చివ‌రి వ‌ర‌కు మాకు దూరంగానే ఉండిపోయారు. అన్న‌గారి ఆశ‌యం మంచిదేన‌ని త‌ర్వాత న‌టీన‌టులు చెప్పుకొచ్చారు.