జ‌గ‌న్ లెక్క‌లు మారిపోయాయి.. మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ అప్పుడే…!

ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఎప్పుడా ? అని ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. అసలు జగన్ మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో చేస్తారా ? లేదా అన్న అనుమానాలు కూడా ఆ పార్టీ నేతలకు ఉన్నాయి. జగన్ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వెంటనే రెండున్నర సంవత్సరాల తర్వాత తాను మంత్రివర్గ విస్తరణ చేపడతానని చెప్పారు. అయితే జగన్ ముఖ్యమంత్రి అయి మరో రెండు నెలలకు మూడు సంవత్సరాలు పూర్తవుతుంది.

వాస్తవంగా గత దసరాకు జగన్ మంత్రివర్గాన్ని మారుస్తారని అందరూ అనుకున్నారు. ఆయన ముందు హామీ ఇచ్చినట్టు ఇప్పుడు క్యాబినెట్ లో ఉన్న మంత్రుల్లో 90% మంది మంత్రులను మార్చే వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తానని చెప్పారు. అయితే కరోనా కారణంగా మంత్రులు అందరూ దాదాపు ఏడాదిన్నర పాటు ఇళ్ల‌కే పరిమితం కావలసి వచ్చింది. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారంతా ఏడాదిన్నర కాలంగా పేరుకు మాత్రమే మంత్రులుగా ఉన్నారు… ఎవరికి వారు తమ సొంత నియోజక వర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకోలేని పరిస్థితి ఉంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మ‌రో మూడు, నాలుగు నెల‌ల్లో కేబినెట్ ఏర్ప‌డి మూడు సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో జగన్ తన కేబినెట్లో మార్పులు చేర్పులు చేస్తున్నారట. దాదాపు 90% మంది మంత్రులను మార్చి… వారి స్థానంలో కొత్తవారిని తీసుకుంటారని తెలుస్తోంది. అయితే ఉగాది నాటికి కొత్త జిల్లాలు ఏర్పడుతున్నాయి. ఆ కొత్త జిల్లాల ప్రాతిపదికగానే మంత్రివర్గంలో మార్పులు.. చేర్పులు ఉంటాయని వైసిపి వర్గాల్లో ప్రచారం నడుస్తోంది.

ఇటీవల రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను మారుస్తూ… కొత్తగా మరో 13 జిల్లాలను తీసుకువచ్చారు. ఉగాది నాటికి కొత్త జిల్లాల నుంచి పాల‌న‌ ప్రారంభం కానుంది. దీంతో పాటు సామాజిక సమీకరణలు… కొత్త జిల్లాలు కూడా ఈసారి మంత్రివర్గంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని తెలుస్తోంది. జూన్ 8వ తేదీతో మంత్రివర్గం ఏర్పాటు అయిన మూడేళ్ళు పూర్తవుతుంది. అప్పుడే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది.