పాన్ ఇండియన్ సినిమాలపై కన్నేసిన టాలీవుడ్ స్టార్స్..

ప్రస్తుతం తెలుగు సినిమా హీరోలంతా పాన్ ఇండియన్ పాట పాడుతున్నారు. ప్రతి హీరో పాన్ ఇండియా స్థాయి గుర్తింపు కోసం తహతహలాడుతున్నారు. ఇతర భాషల్లోనూ తమ స్థాయిని పెంచుకోవడంతో పాటు మార్కెట్ ను డెవలప్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే టాలీవుడ్ స్టార్స్ అంతా పాన్ ఇండియా సినిమాలు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. బాహుబలి సినిమాతో ప్రభాస్ ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నాడు. దాన్ని కొనసాగిస్తూ ఆయన అదే స్థాయి సినిమాల్లో నటిస్తున్నాడు.  తాజాగా అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియన్ స్టార్ గుర్తింపు తెచ్చుకున్నాడు పుష్ప సినిమాతో ఇతర రాష్ట్రాల్లోనూ సినీ అభిమానులను ఆకట్టుకున్నాడు.

బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్ పాన్ ఇండియన్ మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో రాంచరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాతో వీరిద్దరు పాన్ ఇండియన్ నటులుగా గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంది. అటు కొరటాల శివతో ఎన్టీఆర్ తాజా మూవీ, శంకర్, గౌతమ్ తిన్నసూరితో చరణ్ చేస్తున్న సినిమాలు కూడా మల్టీ లాంగ్వేజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే  విజయ్ దేవరకొండ కూడా పాన్ ఇండియన్ స్టార్ డమ్ మీద ఫోకస్ పెట్టాడు. తెలుగులో ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో.. ఇప్పుడు లైగర్ మూవీతో హిందీతో పాటు ఇతర భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అటు సుకుమార్ తో పాటు పూరీతో వర్క్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ కూడా ఓ పాన్ ఇండియన్ రేంజి మూవీ చేస్తున్నాడు. హరి హర వీరమల్లు సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఇన్నాళ్లు తెలుగుకే పరిమితం అయిన రవితేజ కూడా టైగర్ నాగేశ్వర్ రావు సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అటు మహేష్ బాబుతో రాజమౌళి కూడా పాన్ ఇండియన్ మూవీని ప్లాన్ చేస్తున్నాడు. అటు కల్యాణ్ రామ్ ప్రస్తుతం నటిస్తున్న డెవిల్ మూవీని పాన్ ఇండియన్ మూవీగా రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.  సందీప్ కిషన్  మైఖేల్ మూవీని కూడా పలు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అటు నాగ చైతన్య లాల్ సింగ్ చద్దాతో బాలీవుడ్ లో అడుగు పెడుతున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఛత్రపతి హిందీ రీమేక్ సినిమా చేస్తున్నాడు. మొత్తంగా తెలుగు స్టార్స్ అంతా పాన్ ఇండియన్ స్టార్స్ గా మారిపోతున్నారు.