అటూ ఇటూ కాకుండా పోయిన టీడీపీ నేత‌.. టిక్కెట్ లేన‌ట్టే..?

రాజ‌కీయాల్లో స‌రైన టైంలో స‌రైన నిర్ణ‌యం ముఖ్యం. ఎన్ని సంవ‌త్స‌రాలు రాజ‌కీయాలు చేసిన సీనియ‌ర్ నేత అయినా కూడా ఒక్క రాంగ్ స్టెప్ వేస్తే చాలు.. పాతాళంలోకి వెళ్లిపోతారు. ఇప్పుడు క‌డ‌ప జిల్లా పులివెందుల‌కు చెందిన టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్సీ స‌తీష్‌రెడ్డి ప‌రిస్థితి కూడా అలాగే ఉంది. పులివెందుల‌లో వైఎస్ ఫ్యామిలీని ఢీ కొట్టి పార్టీని నిల‌బెట్టిన చ‌రిత్ర స‌తీష్‌రెడ్డిదే. గ‌తంలో దివంగ‌త వైఎస్సార్‌పై రెండు సార్లు, ఆ త‌ర్వాత ఆయ‌న త‌న‌యుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై మ‌రో రెండు సార్లు ఆయ‌న పోటీ చేసి ఓడిపోయారు. పులివెందుల‌లో వైఎస్ ఫ్యామిలీపై గెల‌వ‌డం క‌ష్ట‌మే కావ‌చ్చు.. కానీ అక్క‌డ వారిని ఢీ కొట్టి పార్టీని నిల‌బెట్ట‌డ‌మే గొప్ప విష‌యం..

అందుకే 2014లో చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే స‌తీష్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇక స‌తీష్ రెడ్డి పులివెందుల‌లో వైఎస్ ఫ్యామిలీని ఢీ కొట్టార‌న్న సానుభూతితోనే ఆయ‌న‌కు టీడీపీలోనూ, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా క్రేజ్ వ‌చ్చింది. 2014 త‌ర్వాత సతీష్ రెడ్డి కూడా పులివెందులకు నీరు అంటూ శపథం చేసి మరీ గడ్డం పెంచారు. పులివెందుల‌కు నీళ్లు వ‌చ్చాకే ఆయ‌న త‌న శ‌ప‌థం నెరవేర్చుకుని మ‌రీ ఆ తర్వాత మొక్కు తీర్చుకున్నారు.

2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి అనంతరం సతీష్ రెడ్డి రాజ‌కీయాల‌కు దూరం జ‌ర‌గ‌డంతో పాటు టీడీపీకి రాజీనామా చేసేశారు. అంతే కాకుండా టీడీపీ ఇక కోలుకోద‌ని.. లోకేష్ నాయకత్వంలో ఆ పార్టీ ఎప్పటికీ అధికారంలోకి రాదని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ త‌ర్వాత ఆయ‌న వైసీపీలోకి వెళ‌తార‌న్న ప్ర‌చారం జ‌రిగింది. వైసీపీలో చేర్చుకునేందుకు కూడా జ‌గ‌న్ రెడీ అయ్యారు. అయితే స‌తీష్‌రెడ్డి మాత్రం ఏ పార్టీలో చేర‌కుండా సైలెంట్‌గానే ఉంటున్నారు.

ఇక కొంత కాలంగా పులివెంద‌ల బాధ్య‌త‌లు చూస్తోన్న బీటెక్ ర‌వినే టీడీపీ అధిష్టానం పులివెందుల ఇన్‌చార్జ్‌గా నియ‌మించింది. అయితే స్థానిక నేత‌లు కొంద‌రు మాత్రం స‌తీష్‌రెడ్డినే ఇన్‌చార్జ్‌గా నియ‌మించాల‌ని చంద్ర‌బాబుకు సూచించారు. చంద్రబాబు మాత్రం సతీష్ రెడ్డి పార్టీలోకి వచ్చినా టిక్కెట్ ఇచ్చేది లేదని, బీటెక్ రవికే ఇస్తామ‌ని చెప్పేశారు. ఏదేమైనా ఇప్పుడు స‌తీష్‌రెడ్డి అటూ ఇటూ కాకుండా పోయారు. ఆయ‌న తిరిగి టీడీపీలోకి వ‌చ్చినా ఆయ‌న‌కు సీటు అయితే రాన‌ట్టే..?