సినిమా టికెట్ ధరలపై చెప్పకనే చెప్పేసిన జగన్

ఏపీలో సినిమా ధరల తగ్గింపు, టికెట్లను ప్రభుత్వమే విక్రయించడం.. సౌకర్యాలు లేని థియేటర్లను సీజ్ చేయడం .. లాంటివి కొద్ది రోజులుగా జరుగుతున్నాయి. అధికారులు సినిమా థియేటర్లను పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని సీజ్ చేశారు. ఇక వీటికితోడు తక్కువ ధరకు టికెట్లు విక్రయిస్తే థియేటర్ నిర్వహణ కూడా కష్టమవుతుందని కొందరు థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేశారు. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఎవ్వరూ నేరుగా ఖండించడం లేదు. సినిమా పెద్దలైతే మంచి రోజులొస్తాయి.. సీఎం నిర్ణయం మార్చుకుంటారని సున్నితంగా తమ అభిప్రాయాలు చెబుతున్నారు.

సీనియర్ నటులు ఆర్. నారాయణ మూర్తి ఇటీవల మంత్రిని కలిసి పరిశ్రమ బతికేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సినీ హీరో నాని అయితే సంచలన కామెంట్ చేశాడు. థియేటర్ కౌంటర్ కంటే కిరాణా కొట్ల కలెక్షన్లు ఎక్కువుంగా ఉంటునానయని పేర్కొన్నాడు. దీనిని ఏపీ మంత్రులు ఖండించారు కూడా. సినీ పరిశ్రమ పెద్దలు మాత్రం నోరు విప్పడం లేదు. చిరంజీవి, దిల్ రాజు లాంటి వాళ్లు మాత్రం ఈ విషయంపై సీఎం జగన్ ను కలుస్తాం.. మాట్లాడతాం అంటున్నారు కానీ సీఎంఓ నుంచి వారికి ఎటువంటి ఆహ్వానమూ రాలేదు. ఇలా సినిమా చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి శనివారం సంచలన కామెంట్స్ చేశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో జగన్ పింఛన్ల పెంపు కార్యక్రమంలో పాల్గొన్నారు. పింఛన్ ను రూ. 2250 నుంచి రూ.2500కు పెంచారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జగన్ మాట్లాడుతూ.. పేదలకు వినోదాన్ని అందుబాటులో అందించేందుకు థియేటర్ టికెట్ల ధరలు తగ్గించామని, ఈ విషయంలో పలువురు పలు రకాలుగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. పేదలకు వినోదం అందకుండా చేసే ఇటువంటి వారంతా పేదలకు శత్రువులు కాదా అని అన్నారు. పేదలకు మంచి జరగకూడదని వారు కోరుకుంటున్నారని, కొత్త సంవత్సరంలో అయినా వారి ఆలోచనలు మారాలని పేర్కొన్నారు. సీఎం.. ఎవరి పేరునూ ప్రస్తావించకుండా సినిమా గురించి,టికెట్ల వ్యవహారంపై మాట్లాడటం పరిశ్రమంలో చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా ఏపీ ప్రభుత్వం టికెట్ల తగ్గింపుపై తీసుకున్న నిర్ణయాన్ని కచ్చితంగా అమలు చేస్తామని జగన్ పరోక్షంగా సంకేతాలిచ్చాడా అని పరిశీలకులు భావిస్తున్నారు. సీఎం అంత కచ్చితంగా చెబితే ప్రభుత్వంతో చర్చలకు వెళ్లి ఏం ప్రయోజనమని కూడా సినీ పెద్దలు అనుకుంటున్నట్లు సమాచారం.