చారిత్రక పురుషుడు ఎన్టీఆర్ కు ఘన నివాళి..

ఎన్టీఆర్.. తెలుగు సినిమా పరిశ్రమకు మూల స్తంభం. ఆయన నటించిన ఎన్నో అద్భుత సినిమాలు తెలుగు జనాలను ఎంతగానో అలరించాయి. సినిమా ఏదైనా.. పాత్ర ఎలాంటిదైనా.. అద్భుతంగా నటించడంలో ఆయనకు ఆయనే సాటి. తన నటనే కాదు.. రాజకీయ ప్రస్తానంతోనూ తెలుగు వాడి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహానుభావుడు ఎన్టీఆర్. తెలుగు జనాల తెగువను చూపించిన వ్యక్తి. సినిమాల విషయంలోనే కాదు రాజకీయాల్లోనూ.. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న నటుడు ఎన్టీఆర్.

తెలుగు నేలపై 1923 మే 23న ఆయన జన్మించాడు. కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు గ్రామంలో చిన్న వ్యవసాయ కుటుంబంలో ఈ మహాను భావుడు పురుడుపోసుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి.. సినిమా పరిశ్రమలో అడుగు పెట్టాడు. 1949లో మనదేశం సినిమాతో హీరోగా మారాడు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. సుమారు 320 సినిమాల్లో నటించి మెప్పించాడు. పౌరాణికి, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాలు చేశాడు. ఏ సినిమా అయినా ఆయా పాత్రల్లో ఒదిగిపోయిన నటించాడు ఎన్టీఆర్. శ్రీ కృష్ణుడు, శ్రీ రాముడు, దుర్యోధనుడు, భీష్ముడు, భీముడు, రావణాసురుడు లాంటి వారు ఎన్టీఆర్ లాగే ఉంటారు అనేలా నటించాడు. పండితుల నుంచి పామరుల వరకు అందరూ ఆయన అభిమానులే అని చెప్పుకోవచ్చు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన కీర్తి నిలిచి ఉంటుంది. అంతగా జనాల ఆదరణ అందుకున్నాడు.

సినిమా పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన ఆయన ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు. తెలుగు దేశం పేరుతో పార్టీని స్థాపించాడు. పార్టీని నెలకొల్పి ఏడాదిలోనే అధికారాన్ని చేపట్టిన రాజకీయ వేత్త ఎన్టీఆర్. ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన ఆయన జన సమస్యల పరిష్కారంతో పాటు ఎన్నో మేలు కలిగించే పథకాలను ప్రవేశ పెట్టారు. ఆయన పాలనలో నీతి కనిపించేది. జనాలను ఉద్దరించాలి అనే భావన కలిగేది. ఎన్టీఆర్ పాలనలో జనాలు అంతకు ముందుతో పోల్చితే చాలా సంతోషంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆ మహనీయుడి వర్థంతి నేడు. ఈ సందర్భంగా తనకు నివాళులర్పిద్దాం..