రావత్ స్థానంలో వచ్చేదెవరో?

భారత రక్షణ రంగంలో బిపిన్ రావత్ ఓ స్పెషల్.. అటువంటి మహావ్యక్తి.. దేశం కోసం సర్వస్వాన్ని అర్పించిన వ్యక్తి.. యువతలో నిత్యం స్ఫూర్తి నింపే నిత్య సైనికుడు ఉన్నట్టుండి అద్రుశ్యమయ్యారు. ఆయన మరణాన్ని యావద్భారతం జీర్ణించుకోలేకపోతోంది. ఇది కల అయితే బాగుండు అని చాలా మంది అనుకుంటున్నారు. అయినా.. దురద్రుష్టం.. విధి ఆయనను వెంటాడి బలితీసుకుంది. చివరి క్షణం వరకూ దేశం కోసం తపిస్తూనే కన్నుమూశారు. రావత్ మరణంతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలనేది ఇపుడు మోదీ ముందున్న పెద్ద ప్రశ్న.

త్రివిధ దళాధిపతిగా ఎవరిని నియమిస్తే బాగుంటందనే విషయంపై మోదీ ఇప్పటికే నిపుణులు, సైనికాధికారులతో చర్చించినట్లు సమాచారం. కేబినెట్ సమావేశంలో కూడా ఈ విషయంపై చర్చ జరిగిందని తెలుస్తోంది. ఆలస్యం చేయకుండా ఎంత వీలైతే అంత తొందరగా సీడీఎస్ కు చీఫ్ ను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. రావత్ మరణంతో ఆగిపోయిన పనిని తిరిగి అక్కడి నుంచి మొదలు పెట్టడానికి ఎవరిని నియమించాలో మోదీ జల్లెడ పడుతున్నారు. ప్రస్తుతానికైతే ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు సీడీఎస్ చీఫ్ గా నియమితులయ్యే అవకాశాలున్నట్లు తెలిసింది. వైస్ సీడీఎస్ ఎయిర్ మార్షల్ రాధాక్రిష్ణ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈయన రావత్ కలిసి పనిచేశారు. రావత్ ఆలోచనలకు అనుగునణంగానే రాధాక్రిష్ణ కూడా పనిచేశారని, ఈయనను నియమిస్తే మేలని కొందరు సూచించినట్లు సమాచారం. ఆయనతోపాటు బయటకు వచ్చిన మరో పేరు మనోజ్ ముకుంద్. ప్రస్తుతం మనోజ్ ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఒకరి పేరు దాదాపు ఖరారైనట్లు తెలిసింది. సాధ్యమైనంత తొందరలోనే సీడీఎస్ చీఫ్ ను కేంద్ర ప్రభుత్వం నియమించనున్నట్లు తెలుస్తోంది.