శైలజా..రేవంత్‌.. మధ్యలో 15 లక్షలు

కాంగ్రెస్‌ పార్టీ.. జాతీయస్థాయిలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రాభవం కోల్పోయింది. తెలంగాణలో చెప్పుకోదగ్గ ప్రజాప్రతినిధులు ఉన్నారు కానీ ఏపీలోమాత్రం దారుణం.. పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే పార్టీ కార్యకలాపాల నిర్వహణకు కూడా దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ రాష్ట్రం విడిపోయిన అనంతరం కొద్దిరోజుల పాటు ఏపీసీసీ, టీపీసీసీ కమిటీలో ఒకే చోట నిర్వహించారు. ఏపీసీసీ ఇందిరాభవన్‌నుంచి కార్యకలాపాలు నిర్వహించగా.. టీపీసీసీ గాంధీభవన్‌ నుంచి నిర్వహించింది. ఆ తరువాత ఏపీసీసీ కార్యాలయం విజయవాడికు మారిపోయింది. విజయవాడకు మారిన అనంతరం ఆర్థిక పరిస్థితి దారుణాతిదారుణంగా మారిందని తెలిసింది. రఘువీరా రెడ్డి పీసీసీ చీఫ్‌ గా ఉన్నపుడు బండి ఎలాగోలా నడిచిపించాడు.

ఇపుడు శైలజానాథ్‌ హయాంలో ఏపీసీసీ బ్యాలెన్స్‌ నిల్‌ అని సమాచారం. చిన్న చిన్న కార్యక్రమాలకు కూడా జేబులు తడుము కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఏం చేయాలో పాలుపోక ఏపీసీసీ చీఫ్‌ శైలజానాథ్‌ తలపట్టుకుంటున్నారట. అయితే ఇటీవల ఆయనకు ఓ విషయం గుర్తుకొచ్చిందట. ఏంటంటే.. గతంలో హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉన్నపుడు టీపీసీసీకి ఏపీసీసీ రూ. 15 లక్షలు ఇచ్చింది. టీపీసీసీ చీఫ్‌గా పొన్నాల లక్ష్మయ్య ఉన్నపుడు రఘువీరారెడ్డి ఈ మొత్తాన్ని రుణంగా ఇచ్చారు. ఈ కష్టకాలంలో ఆ డబ్బు తమకు ఇవ్వాలని శైలజానాథ్‌ ..టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని అడుగుతున్నాడు. ఏపీలో పార్టీకి డబ్బులు వచ్చే పరిస్థితి లేదు.. ఎవరూ విరాళాలూ ఇవ్వరు. ఇక సభ్యత్వ నమోదు కూడా పెద్దగా లేదు.దీంతో ఈ గడ్డు పరిస్థితిని ఎదుర్కోవడానికి తమ రూ.15 లక్షలు ఇవ్వాలని శైలజా కోరుతున్నారట. ఆ మొత్తం ఇవ్వకపోతే పార్టీ నిర్వహణ కష్టంగా మారిందని చెప్పినట్లు సమాచారం. ఆ డబ్బులిస్తే కొద్దిరోజుల పాటు ఏపీసీసీ బండి నడపవచ్చని రేవంత్‌తో నిర్మొహమాటంగా అడిగారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే శైలజా నాథ్‌కు రేవంత్‌ రెడ్డి మాత్రం ఎటువంటి హామీ ఇవ్వలేదని తెలిసింది.

Share post:

Latest