రవితేజ బ్యాక్ : నెల గ్యాప్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు..!

ఇడియట్ హిట్ తర్వాత ఏ స్టార్ హీరో చేయని విధంగా వరుసబెట్టి సినిమాలు చేశాడు మాస్ మహారాజా రవితేజ. ఏడాదికి మూడు, నాలుగు చొప్పున సినిమాలు చేసుకుంటూ వెళ్ళాడు. కిక్ సినిమా వరకు ఈ పరంపర కొనసాగింది. ఆ తర్వాత రవితేజను వరుస పెట్టి ప్లాపులు పలకరించడంతో ఆయన జోరు కొంచెం తగ్గింది.
పవర్, బలుపు, రాజా ది గ్రేట్ వంటి సినిమాలు హిట్ అయిన ప్పటికీ మధ్యలో టచ్ చేసి చూడు, అమర్ అక్బర్ ఆంటోనీ వంటి భారీ డిజాస్టర్స్ రావడంతో రవితేజ ఉత్సాహం తగ్గింది.

కానీ గోపి చంద్ మలినేని తో రవితేజ చేసిన క్రాక్ సినిమా బంపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా రవితేజ కెరీర్లో ఊపోచ్చింది. గతంలోలాగా రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను మళ్ళీ విడుదల చేస్తున్నాడు. ఫిబ్రవరి 25వ తేదీన రవితేజ -రమేష్ వర్మ కాంబినేషన్ లో వస్తున్న ఖిలాడి సినిమా విడుదల అవుతుండగా, కరెక్టుగా మళ్లీ నెల తర్వాత మార్చి 25వ తేదీన రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాను రవితేజ విడుదల చేస్తున్నాడు. ఈ సినిమాకు న్యూ డైరెక్టర్ మండవ దర్శకత్వం వహించాడు.

నెల గ్యాప్ లో రవితేజ రెండు సినిమాలు విడుదల అవుతుండటంతో మళ్లీ ఆయన పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి. రవితేజ వరుసబెట్టి సినిమాలు అంగీకరిస్తుండటంతో ఆయన ఫ్యాన్స్ కూడా సంతోషంగా ఉన్నారు. కాగా రవితేజ ఈ రెండు సినిమాల విడుదల తర్వాత త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. అలాగే న్యూ డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వర్ రావు అనే మరో సినిమా కూడా ప్రారంభించనున్నాడు.