కారులో ఇమడలేకపోతున్న పొంగులేటి

ఖమ్మం జిల్లాలో సీనియర్ టీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇపుడు పార్టీలో కష్టకాలం వచ్చిందట. గతంలో వైసీపీలో ఉన్నపుడు ఖమ్మం ఎంపీగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో వైసీపీ రాజకీయ కార్యకలాపాలు చేపట్టకపోవడం, ఏపీపైనే పూర్తిగా ద్రుష్టి సారించడంతో పొంగులేటి కారు పార్టీ వైపు వెళ్లిపోయారు. అప్పటి నుంచీ టీఆర్ఎస్ పార్టీలోనే చురుగ్గా ఉంటున్నారు. అయితే కొద్ది కాలంగా పొంగులేటికి గులాబీ నేతల నుంచి సహకారం లభించడం లేదని, అధిష్టానానికి ఆయన గురించి ఫిర్యాదులు చేస్తున్నారని తెలిసింది.

తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ పార్టీ అన్ని స్థానాలను (ఆరు) కైవసం చేసుకుంది. అయితే అనుకున్న మెజారిటీ రాలేదని, క్రాస్ ఓటింగ్ జరగడం వల్ల పార్టీ పరువు పోయిందని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో పలువురు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లు వేశారని అందుకే అక్కడ మెజారిటీ తగ్గిందని ముఖ్య నాయకులు భావిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థి మధు విజేతగా నిలిచినా దాదాపు 300 ఓట్లు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయని, వారికి ఓటర్లు లేకున్నా అన్ని ఓట్లు ఎలా వచ్చాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా అధిష్టానానికి మిగిలిపోయింది. అంటే అక్కడి నాయకులు పార్టీకి నష్టం వాటిల్లేలా ప్రవర్తించారని అనుమానిస్తోంది.

ఈ నేపథ్యంలోనే స్థానిక జిల్లా నాయకులు పొంగులేటిని టార్గెట్ చేశారు. క్రాస్ ఓటింగుకు ఈయనే కారణమని ఫిర్యాదులు కూడా చేశారు. ఇదిలా ఉండగా వైసీపీ నుంచి కారు పార్టీలోకి వచ్చే సమయంలో పార్టీ అధిష్టానం తనకు అనేక హామీలు ఇచ్చిందని, ఏవీ పూర్తి చేయలేదని పొంగులేని సన్నిహితులతో పేర్కొంటున్నట్లు తెలిసింది. ఎంపీ టికెట్ ఇవ్వకపోగా కనీసం ఎమ్మెల్సీగా చేయలేకపోయారని, తాను ఇక పార్టీలోకి వచ్చి ఏం ప్రయోజనమని అంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పొంగులేటి తన కోపాన్ని క్రాస్ ఓటింగ్ రూపంలో తీర్చుకున్నారని నాయకులు పేర్కొంటున్నారట.అందుకు ఆధారాలను కూడా ఖమ్మం నాయకులు కేటీఆర్ ముందుంచారట. ఈ పరిణామాలను గమనిస్తే భవిష్యత్తులో పొంగులేటి కారు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరే అవకాశాలు కూడా లేకపోలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.