టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొద్దిరోజులుగా మోకాళి నొప్పుతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆయన పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు. అయితే కొంతకాలంగా ఈ నొప్పి మరింత తీవ్రం కావడంతో సర్జరీ చేయించుకోవాలని మహేష్ బాబు నిర్ణయం తీసుకున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా మహేష్ బాబుకు సర్జరీ విజయవంతమైనట్లు తెలుస్తోంది.
స్పెయిన్ లోని ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో మహేష్ బాబు మోకాలికి సర్జరీ చేశారు. అది విజయవంతం కావడంతో అక్కడి నుంచి ఆయన దుబాయ్ కి చేరుకొని.. అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. మహేష్ కుటుంబం కూడా ఆయన వెంటే ఉంది. కాగా సుమారు రెండు నెలల పాటు మహేష్ బాబు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం.
పూర్తిగా కోలుకున్న తర్వాత మహేష్ బాబు ఫిబ్రవరి సెకండ్ వీక్ నుంచి సర్కారు వారి పాట సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా ఈ సినిమా ఏప్రిల్ 1న విడుదల అవుతుందని ఇదివరకే మేకర్స్ ప్రకటించారు. అయితే ప్రస్తుతం మహేష్ బాబు సర్జరీ జరగడంతో ఆ సినిమా ముందు ప్రకటించిన డేట్ లో విడుదల అవుతుందా లేదా అన్నది ప్రస్తుతం సందేహంగా మారింది. మహేష్ సర్కారు వారి పాట మూవీ పూర్తి అయిన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా సినిమా చేయాల్సి ఉంది.