ప‌వ‌న్‌కు వార్నింగ్ ఇచ్చిన రానా..సూప‌ర్ అంటున్న ఫ్యాన్స్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి మొద‌టి సారి క‌లిసి న‌టిస్తున్న తాజా మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `భీమ్లా నాయ‌క్‌`. సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ సినిమాలో నిత్యా మీన‌న్‌, సంయుక్త మీన‌న్ హీరోయిన్లుగా న‌టించారు.

మలయాళంలో సూప‌ర్ హీట్‌గా నిలిచిన `అయ్యపనుమ్ కోషియుమ్` చిత్రానికి రీమేక్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ప‌వ‌న్ భీమ్లా నాయ‌క్ అనే ప‌వ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌గా, రానా డేనియర్‌ శేఖర్ అనే రిటైర్డ్‌ ఆర్మీ అధికారిగా క‌నిపించ‌బోతున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన స్పెషల్ పోస్టర్స్, గ్లింప్స్‌, సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

అయితే నేడు రానా బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. ఈ సినిమాలో ఆయ‌న‌కు పాత్ర‌ను సంబంధించిన టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. ఇందులో `వాడు అరిస్తే భయపడతావా? ఆడికన్నా గట్టిగా అరవగలను.. ఎవడాడు? దీనమ్మ దిగొచ్చాడా.. ఆఫ్ట్రాల్ ఎస్ఐ సస్పెండెడ్..` అంటూ రానా ఆవేశంగా పవన్ కళ్యాణ్‌కి వార్నింగ్ ఇస్తూ క‌నించారు.

ప్ర‌స్తుతం ఆక‌ట్టుకుంటున్న ఈ టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను అమాంతం పెంచ‌డ‌మే కాదు.. నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ఈ టీజ‌ర్‌ను చూసిన రానా ఫ్యాన్స్ సూప‌ర్, అదిరింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న విడుద‌ల కానుంది. రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీకి త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు.