రాజకీయ విమర్శలే వాంగ్మూలంలోకి వచ్చాయే!

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైన నాటినుంచి.. ఆ దుర్ఘటనను వాడుకునిన జగన్మోహన రెడ్డి ని ఇరుకున పెట్టడానికి విపక్ష తెలుగుదేశం అనేక రకాల కుట్రపూరిత ప్రచారాలకు తెరలేపింది. ‘చిన్నాన్న హత్యతో వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ప్రత్యక్ష ప్రమేయం ఉంది’ అనే విమర్శ చేయలేదు తప్ప.. అలాంటి భావనను కలిగించేలా తెలుగుదేశం నాయకులు రకరకాల విమర్శలు చేశారు. కేసు విచారణను జగన్ కావాలనే పక్కదారి పట్టిస్తున్నట్టుగా, కేసు విచారణలో కాలయాపనకు కారణం అవుతున్నట్లుగా ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు.

అదే సమయంలో.. తెలుగుదేశం పార్టీ వారు ఈ హత్యకు కారకుడిగా ఎవరి పేరునైతే ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చారో.. ఎవరితో సంబంధాన్ని ముడిపెట్టి జగన్ ను కూడా అప్రతిష్ట పాల్జేయాలని చూశారో.. ఆ వ్యక్తి పేరే.. ఇప్పుడు ప్రధానంగా వార్తల్లోకి వస్తోంది. వివేకా హత్యకేసును విచారిస్తున్న సీబీఐ అధికార్లకు, ఆయన మాజీ డ్రైవరు దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో వెలికి వచ్చింది. ఇప్పుడు అందరి కళ్లూ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వైపు చూస్తున్నాయి..!

తెలుగుదేశం పార్టీ తొలినుంచి అవినాష్ రెడ్డి ఈ హత్యకు ప్రధాన కారకుడని ఆరోపిస్తోంది. వివేకా ప్రాతినిధ్యం వహించిన కడప ఎంపీ స్థానం నుంచే ఇప్పుడు అవినాష్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. ఈ కారణం వల్ల.. ముడిపెట్టవచ్చునని అనుకున్నారో ఏమో తెలియదు. ఇప్పుడు దస్తగిరి వాంగ్మూలంలోకూడా ఆ పేరే బయటకు వచ్చింది. అయితే నిర్దిష్టంగా.. అవినాష్ రెడ్డి పాత్ర ఉన్నట్టుగా ఆ వాంగ్మూలం చెప్పడం లేదు. ఆ పేరును గంగిరెడ్డి తనతో అన్నట్టు మాత్రమే దస్తగిరి చెప్పాడు. ఇప్పుడిక గంగిరెడ్డి ఏం చెబుతాడు? అనేదాని మీద విషయం ఆధారపడి ఉంటుంది.

హత్య జరిగిన తీరును దస్తగిరి చాలా విపులంగా కళ్లకు కట్టినట్టుగా న్యాయమూర్తి, సీబీఐ లకు ఇచ్చిన వాంగ్మూలంలో వివరించడం విశేషం. అయితే ఇవన్నీ ఎంతమేరకు నిలబడతాయో ఇంకా వేచిచూడాలి. మొత్తానికి హత్యలో నలుగురు పాల్గొన్నారు. ప్రధానంగా హత్య చేశాడని చెబుతున్న గంగిరెడ్డితో సహా, సునీల్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి కూడా హత్యలో భాగస్వాములే.

అయితే వారి వెనుక ఉండి హత్య చేయించిన వారు ఎవరనే విషయంలో కేవలం దస్తగిరి మాటలతోనే ఒక నిర్ధరణకు రావడానికి అవకాశ లేదు. అయితే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఆప్తుడు, వైఎస్ జగన్ వారసుడిగా కడప ఎంపీ హోదాలో ఉన్న అవినాష్ రెడ్డి అసలు సూత్రధారి అని ఈ వాంగ్మూలం చెబుతున్నది. ఈ అంశాన్ని రాజకీయ మైలేజీ కోసం వాడుకోవడానికి తెలుగుదేశం, విపక్షాలు గరిష్టంగా ప్రయత్నిస్తాయనడంలో సందేహం లేదు. కానీ నిజానిజాలు తేలాలంటే ఇంకా వేచిచూడాలి. గంగిరెడ్డి వాంగ్మూలం కూడా బయటకు రావాలి.

Share post:

Popular