తొలి సినిమాకు వెంక‌టేష్ రెమ్యూన‌రేష‌న్ ఎంతో తెలుసా?

విక్ట‌రీ వెంక‌టేష్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌డా నిర్మాత‌ డి.రామానాయుడు త‌న‌యుడిగా తెలుగు సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ప్ప‌టికీ.. సొంత టాలెంట్‌తో స్టార్ ఇమేజ్‌ను సొంత చేసుకున్నాడీయ‌న‌. ఇక వెంక‌టేష్ తొలి చిత్రం ఏదీ అంటూ ట‌క్కున అంద‌రూ 1986లో వ‌చ్చిన `కలియుగ పాండవులు` అనే చెబుతుంటారు.

కానీ, ఈ చిత్రం కంటే ముందే వెంకీ మ‌రో మూవీలో న‌టించాడు. అదే `ప్రేమ్ నగర్`. అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ జంట‌గా కె.ఎస్.ప్రకాశరావు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని సురేష్ మూవీస్ బ్యాన‌ర్‌పై ద‌గ్గుబాటి రామానాయుడు నిర్మించారు. 1971లో విడుద‌లైన ఈ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. అత్యంత విజయనంతమైన తెలుగు నవలాచిత్రాలలో ఇది ఒకటి.

అంతకు ముందు కొన్ని సినిమాలలో భారీ న‌ష్టాల‌ను ఎదుర్కొన్న రామానాయుడు ఈ సినిమాతో నిర్మాతగా సినీరంగంలో నిలద్రొక్కుకున్నాడు. అయితే ఈ చిత్రంలో వెంకటేష్ ను ఒక చిన్న పాత్రలో నటించమని ఆయ‌న తండ్రి రామానాయుడు అడిగార‌ట‌. కానీ, అందుకు వెంకటేష్ నాకు వెయ్యి రూపాయలు పారితోష‌కంగా ఇస్తేనే చేస్తానని చెప్ప‌గా.. దానికి రామానాయుడు ఒప్పుకున్నార‌ట‌.

ఇక మాట ఇచ్చిన‌ట్టుగానే షూటింగ్ పూర్తైన త‌ర్వాత రామానాయుడు వెంకీకి రూ. 1000 ఇచ్చార‌ట‌. అదే ఆయ‌న తొలి సినిమా రెమ్యూన‌రేష‌న్‌. కాగా, ఇటీవ‌ల దృశ్యం 2తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన వెంక‌టేష్.. ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో `ఎఫ్ 3` చిత్రం చేస్తున్నాడు. అలాగే మ‌రోవైపు రానాతో ఓ వెబ్ సిరీస్‌లోనూ న‌టిస్తున్నాడు.