టీడీపీకి నైతికబలం ఇస్తున్న ఉండవల్లి మాటలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కు ఉన్న విలువ అందరికీ తెలుసు. తాను నమ్మిన విషయాన్ని ముక్కుసూటిగా చెప్పే వ్యక్తిగా, దాని కోసం ఎంతవరకైనా తెగించి పోరాడే వ్యక్తిగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ఆత్మీయులైన మేధావి నాయకులలో ఉండవల్లి అరుణ్ కుమార్ కు ముందు వరుసలో ఉంటారు. వైఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఆయన మార్గదర్శి వ్యవహారాలకు సంబంధించి ‘ఈనాడు’ రామోజీరావు మీద కేసులు నడిపి ఎంతగా ముప్పతిప్పలు పెట్టారో కూడా అందరికీ తెలుసు. అలాంటి ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా చలామణి అవుతున్న చంద్రబాబు నాయుడు కన్నీళ్లు గురించి చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారుతున్నాయి!

- Advertisement -

అలాగని ఆయనేమీ చంద్రబాబును అడ్డగోలుగా వెనకేసుకు రాలేదు! ఆ మాటకొస్తే సభలో జరిగిన దానికి చంద్రబాబు నాయుడు ఆ స్థాయిలో స్పందించి ఉండాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఆయన చెప్పిన ఇతర మాటలు మాత్రం కచ్చితంగా తెలుగుదేశం పార్టీకి నైతిక బలాన్ని అందించేవే.
సుమారు యాభై ఏళ్లుగా తాను రాజకీయాల్లో ఉన్నానని అంటున్న అరుణ్ కుమార్- తాను ఎన్నడూ కూడా నందమూరి తారక రామారావు కుటుంబ సభ్యుల గురించి అవాకులు చెవాకులు వినలేదని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ కుమార్తెలపై ఇప్పటిదాకా ఎలాంటి వదంతులు వినలేదన్నారు. వారి వ్యక్తిత్వం గురించి తనకు ఎలాంటి అనుమానాలు లేవు అని కూడా వెల్లడించారు. అలాగే, ‘చంద్రబాబు నాయుడు సానుభూతి కోసం కన్నీళ్లు పెట్టుకున్నారు’ అని వైయస్సార్ కాంగ్రెసు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. కన్నీళ్ళతో సానుభూతి వస్తుందన్నమాట తాను నమ్మను అని, సానుభూతి కోసం చంద్రబాబు ఏడ్చినట్లుగా తనకు కనిపించలేదని అన్నారు. చంద్రబాబుపై బాంబుదాడి జరిగినా, వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినా ఓట్లలో సానుభూతి రాలేదని గుర్తుచేశారు.

అయితే ఈ సందర్భంగా ప్రభుత్వంలోని కొందరు మంత్రుల మాట తీరును ఆయన తీవ్రంగా నిరసించారు. కొందరు మంత్రులు ఎలా మాట్లాడుతున్నారో అందరికీ తెలుసు. ఎలాంటి మాటలు వాడుతున్నారో అందరికీ తెలుసు- అలాంటి నాయకుల గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం అని చెప్పారు. ఏ సందర్భం లేకుండా కొందరు మాట్లాడుతున్నారంటే వారికి మానసిక ఆరోగ్య సమస్యలు కారణమై ఉంటాయని ఉండవిల్లి వ్యాఖ్యానించడం విశేషం.
ఉండవల్లి మాటలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబునాయుడు అభిమానులకు, నందమూరి అభిమానులకు నైతిక బలం అందించే విషయాలే.

Share post:

Popular