అయ్యో…ఇంతటి అవమానమా?

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరుపతికి వచ్చారు.. దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశంలో పాల్గన్నారు.. ఇతర ముఖ్యమంత్రులు కూడా వచ్చారు.. తెలంగాణసీఎం కేసీఆర్ కూడా సమావేశానికి వెళ్లాల్సింది.. అయితే ఆయనకు బదులుగా రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్.. ఇంతవరకు బాగానే ఉంది.. అయితే అందరికీ లభించినట్లు తెలంగాణ టీమ్ కు మర్యాద దక్కలేదని సీఎస్ నిరసన వ్యక్తం చేశారు. అసలేం జరిగిందంటే.. సాధారణంగా సమావేశానికి వచ్చే ప్రతినిధులకు ప్రతి ఒక్కరికీ రేణిగుంట ఎయిర్ పోర్టులో ఒక లైజనింగ్ అధికారిని కేటాయిస్తారు. అలాగే టీటీమ్ కు కూడా కేటాయించారు. ముందుగానే మంత్రి, సీఎస్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. విచిత్రమేమంటే.. వీరెంతసేపు ఎదురు చూసినా కేటాయించిన ఆఫీసర్ వీరి వద్దకు రాలేదు. దీంతో చేసేదిలేక సొంతంగానే హోటల్ కు వెళ్లిపోయారు.

తీరా అక్కడికి వెళ్లిన తరువాత సదరు ఆఫీసర్ నెమ్మదిగా హోటల్ కు వచ్చి సీఎస్ తో మాట్లాడారు. సార్.. మేము అక్కడే ఉన్నాం.. మీరే కనిపించలేదు.. జరిగిన దానికి సారీ చెప్పారట. మేము మీకెలా కనిపిస్తాం.. మేళా నిలుచున్నట్లు నిలుచుంటే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక.. తమకు సరైన వాహనం కూడా కేటాయించలేదని అగ్రహోదగ్రుడయ్యారట. మీ వాహనం వద్దు.. మా వద్దకు వస్తే సహాయ కార్యదర్శులకు కూడా ఇటువంటి వెహికల్ ఇవ్వం.. మరి మీరు? మేము ప్రైవేటు వాహనం తీసుకుంటాంలే అని అగ్గిమీదగుగ్గిలమయ్యారట. సార్.. ఇటువంటి పొరపాటు భవిష్యత్తులో జరగదని పలుసార్లు చెప్పడంతో సీఎస్ కాస్త శాంతించారు. అసలే ఏపీ, తెలంగాణ మంత్రులు ఒకరిమీద ఒకరు విమర్శించుకుంటూ కాకమీద ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇలా జరగడం విచిత్రం.