ఎవరికీ కలిసిరాని వైద్యశాఖ.. మరి హరీశ్ రావుకు కలిసొస్తుందా?

తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖ అంటేనే నాయకులు వామ్మో.. వద్దులే అని ఆ పదవికి దూరంగా ఉంటున్నారు. ఎవరూ ఒప్పుకోకపోవడం వల్ల కూడా ఆ బాధ్యతను కేసీఆర్ తన వద్దే ఉంచుకున్నారట. ఇక పనిభారం పెరగడంతో బాధ్యతను అల్లుడు హరీశ్ రావుకు అప్పగించారు. అయితే.. వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు తీసుకోవడానికి ఎవరూ ఇష్టపడటం లేదు.. ఎందుకంటే..

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా తాటికొండ రాజయ్యను నియమించారు. అయితే రాజయ్య కేవలం 8 నెలలు మాత్రమే మంత్రిగా పనిచేశారు. ఆయనపై పలు ఆరోపణలు రావడంతో కేసీఆర్ రాజయ్యను తొలగించారు. ఆ తరువాత జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. 2018 వరకు లక్ష్మారెడ్డి మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించినా ఎందుకే కేసీఆర్ లక్ష్మారెడ్డికి వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు అప్పగించేందుకు సుముఖంగా లేకపోయారు. రెండోసారి కారు పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈటల రాజేందర్ ను వైద్య మంత్రిగా చేశారు. ఈటల మంత్రిగా ఉన్నపుడే కోవిడ్ కష్టాలు మొదలయ్యాయి. దీంతో యాక్టివ్ ఉన్న ఈటలకు, కేసీఆర్ కు ఎందుకో విభేదాలు వచ్చాయి. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో ఈటలను మంత్రి వర్గం నుంచి తొలగించారు. అనంతరం కొద్ది రోజుల పాటు ఆ శాఖను కేసీఆర్ తన వద్దే ఉంచుకున్నారు. అయితే కొద్ది రోజుల క్రితమే వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు అప్పగించారు. ముందునుంచీ ఈ శాఖ మంత్రి మారుతూనే ఉన్నారు. మరి హరీశ్ రావు ఈ బాధ్యతలు ఈ టర్మ్ పూర్తయ్యే వరకు ఉంటారో, లేదో చూడాలి మరి.